జనసేనలోకి నాదెండ్ల మనోహర్

11 October, 2018 - 4:36 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

ఈ విషయాన్ని నాదెండ్ల మనోహర్ గురువారం ధ్రువీకరించారు. శుక్రవారం నాదెండ్ల మనోహర్ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం ఆయన జనసేన పార్టీలో చేరనున్నట్లు అధికారికంగా ప్రకటించనున్నారు. మనోహర్ రాకతో జనసేన పార్టీకి అదనపు బలం వస్తుందని ఆ జిల్లా నేతలు భావిస్తున్నారు.

2014లో రాష్ట్ర విభజన అనివార్యమైంది. ఆ తర్వాత పార్టీలోని ముఖ్య నేతలంతా వివిధ పార్టీల్లో చేరారు. కానీ మనోహర్ మాత్రం ఇప్పటి వరకు హస్తం పార్టీలోనే ఉన్నారు. గుంటూరు జిల్లా తెనాలి నుంచి ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు.

ఆ క్రమంలో 2011లో నాదెండ్ల మనోహర్ స్పీకర్‌ పదవి వరించింది. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న ఆయన రాజకీయ భవిష్యత్‌పై అనేక ఉహాగానాలు వెలువడ్డాయి. ఓ దశలో తెంలగాణ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తారని కూడా ప్రచారం కూడా జరిగింది.

అయితే ఆయన అనూహ్యంగా జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. పవన్, మనోహర్ ఇద్దరు స్నేహితులు. అయితే ఇద్దరి రాజకీయ ఆకాంక్షలు కూడా ఒకటే కావడంతో జనసేనతో కలిసి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. నవతరం రాజకీయాలే లక్ష్యంగా మనోహర్‌ జనసేనలో చేరుతున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు.