భోగభాగ్యాల భోగి…

14 January, 2018 - 8:40 AM

                                                 (న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పల్లెల్లోనూ,పట్టణాల్లోనూ తెల్లవారుజామునే లేచి భోగి మంటలు నిర్వహించారు. భోగి మంటలతో సంక్రాంతి పండుగను ఆహ్వానించారు. ముచ్చటైన మూడ్రోజుల పండగ రావడంతో ఇంటింటా సంబురాలు మొదలయ్యాయి. భోగితో మొదలై సంక్రాంతితో కొనసాగింపుగా కనుమతో ముగియనుంది.  ఆదివారం భోగి మంటలతో చిన్నా పెద్ద కలిసి అర్దరాత్రి ఆటలాడారు.

భోగి పండుగతో సంక్రాంతి పర్వదినాలు ఉత్సాహంగా ప్రారంభమవుతాయి. రైతులకు కొత్త పంటలు చేతికి వచ్చిన వేళ, చెరుకు గడలు, పూలతో అలంకరించిన ఎడ్ల బండ్లు, ఇంటి ముందు రంగవల్లులు, గొబ్బెమ్మలు పలకరిస్తున్న వేళ, భోగి మంటలతో ప్రజలు సంక్రాంతిని స్వాగతించారు. ప్రతి ఊరిలో, పట్టణంలో వీధివీధుల్లో భోగి మంటలు కనిపిస్తున్నాయి.

పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరి ప్రాంతాల్లో నిర్వహించిన సంబరాల్లో వారు పాల్గొని ప్రజలతో ఆనందాన్ని పంచుకున్నారు. సినీ సెలబ్రిటీలు సైతం వీధుల్లోకి వచ్చి భోగి మంటలు వేసి ఉత్సాహంగా గడిపారు. భోగి వేడుకలు అంబరాన్ని అంటుతున్న వేళ, మంటల చుట్టూ కోలాటాలు ఆడుతూ పండక్కి స్వాగతం పలికారు. పలువురు ఏపీ మంత్రులు భోగి మంటల ముందు చిన్నారులను కూర్చోబెట్టి భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు.