పవన్ తస్మాత్.. జాగ్రత్త..!

17 April, 2018 - 4:35 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ఎలాంటి వత్తిడులు, ప్రభావాలకు లొంగని, ముక్కు సూటి మనిషి పవన్ కల్యాణ్ రాజకీయ ఎదుగుదలకు కొన్ని శక్తులకు నచ్చడంలేదా..? ఈ క్రమంలో ఏదో ఒక విధంగా పవన్ కల్యాణ్‌ను అణచివేసేందుకు లేదా దెబ్బతీసేందుకు ఆ శక్తులు తెరవెనుక మంత్రాంగం చేస్తున్నాయా? ఇప్పటి వరకూ కొనసాగుతున్న కుల, మత, వర్గ రాజకీయాల కుళ్ళును శుద్ధి చేయాలని, నిరుపేదలు, అభాగ్యులు, తాడితులు, పీడితులు, అణగారిన వర్గాలకు నిస్వార్థంగా సేవ చేయాలనే మంచి లక్ష్యంతో ముందుకు వచ్చిన ఆయనను మధ్యలోనే అణచివేసే కుయుక్తులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయా? అంటే.. అవుననే సమాధానాలు వస్తున్నాయి.. కొన్ని పరిణామాలను, కొందరి వ్యవహార శైలిని చూసినప్పుడు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఈ క్రమంలోనే కొందరు సినీ ప్రముఖులు, మరి కొందరు రాజకీయ నాయకులు, ఇంకొన్ని వర్గాల వారు పవన్ కల్యాణ్‌పై పెద్ద ఎత్తున కుతంత్రాలు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారి దుష్ట పన్నాగంలో భాగంగానే ఓ సినీ విమర్శకుడు, ఒకటి రెండు సినిమాల్లో నటించిన శ్రీరెడ్డి, మరి కొందరు రాజకీయ నాయకుల చేత పవన్ కల్యాణ్‌పై బురద చల్లిస్తున్నారని, తద్వారా ఆయనను లక్ష్యం వైపు కొనసాగనివ్వకుండా అడ్డంకులు సృష్టించేందుకు శత విధాలుగా యత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కల్యాణ్ రాజకీయాల్లో సెటిలైతే.. ఇక తమ ఆటలు కొనసాగవనే భయం వల్ల గానీ, లేదా ఆయన ఎదిగిపోతే తమ అస్తిత్వానికి భంగం కలుగుతుందేమో అనే అనుమానం వల్ల గానీ పవన్ కల్యాణ్‌ను తెర వెనుక నుంచి నాటకం నడిపిస్తుండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఒక్క పిలుపు కారణంగా టీడీపీకి విజయానికి కావాల్సిన ఓట్లు వచ్చాయనేది జగమెరిగిన సత్యం. అలాంటి స్థితిలో కూడా ఆ పార్టీ ‘చావు తప్పి కన్ను లొట్టబోయిన చందం’గా అతి తక్కువ మెజారిటీతోనే అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అలాంటిది ఇప్పుడు పవన్ కల్యాణే స్వయంగా తన జనసేన పార్టీని ఎన్నికల బరిలో నిలబెడుతుండడంతో తమ పీఠాలు కదిలిపోయే ప్రమాదం కొందరిలో స్పష్టంగా కనిపిస్తోందట.

పవన్ కల్యాణ్ ముక్కుసూటి మనిషి. సొంత లాభం చూసుకోడు. తనకు నటుడిగా ఇంతటి జీవితాన్నిచ్చిన ప్రజలకు మంచి చేయాలనే తపన ఉన్న వాడు. ఎలాంటి భేషజాలకూ పోని వాడు. ఎవ్వరి మాటా లెక్క చేయని నిక్కచ్చి మనిషి. అలాంటి పవన్ రాజకీయంగా వెలుగులోని వస్తే.. తమ లైట్లు ఎక్కడ ఆరిపోతాయో అనుకునే అనుమానపు సినీ జీవులు కొందరు పనిగట్టుకుని ఆయనపై కొందర్ని ప్రలోభపెట్టి ఉసిగొల్పుతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలా ఉసిగొల్పులున్న వారిలో ప్రముఖ దర్శకులు, నిర్మాతలు కూడా ఉండవచ్చే ఊహాగానాలు రాజకీయ విశ్లేషకుల్లో వస్తున్నాయి.

గతంలో సినీ విమర్శకుడొకరు పవన్ కల్యాణ్‌పై చేసిన అల్లరి, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు, ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చల పేరుతో చేసిన రచ్చ ఇంతా అంతా కాదు. ఆ క్రిటిక్‌ చేస్తున్న అల్లరిపై పవన్ అభిమానులు స్పందిస్తే.. అందుకు కూడా పవన్ కల్యాణ్‌పైనే అవాకులు, చెవాకులు మాట్లాడిన వైనాన్ని ఇంకా ఎవ్వరూ మర్చిపోలేదు. ఈ లోగా ఇప్పుడు నటి శ్రీరెడ్డి కూడా అంతకు మించిన స్థాయిలో పవన్ కల్యాణ్‌పై నోరు పారేసుకునే విధానం కూడా వారి వెనుక పెద్దల హస్తం తప్పక ఉంటుందనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే తెలుగు ప్రజల నుంచి చురకత్తుల్లాంటి ఫ్యాన్స్, తెలుగు ప్రజల నుంచి ఎనలేని ఆదరణ ఉన్న పవన్ కల్యాణ్‌పై ఏకవచనంతో మాట్లాడే ధైర్యం వీరికి ఎక్కడి నుంచి వస్తుందనేది పరిశీలకుల్లో వస్తున్న ప్రశ్న.

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ గతంలో తన అభిమానులను ఉద్దేశించి చెప్పిన మాటల వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఒక్కోసారి ఎవరైనా తిడిగే మీకు బాధగా ఉంటుంది అని నాకు తెలుసు. కానీ మనం భరిద్దాం. బలవంతుడే భరిస్తాడు. భరించిన వాడే గెలుస్తాడు. ఎదురు దాడి చేయవద్దు భరించండి. అలా చూడండి. ఎంతసేపు అంటుంటే అంతసేపు చూడండి. మార్పు దానంతట అదే చాలా సైలెంట్‌గా వచ్చేస్తుంది’ అనేది ఆయన తెలంగాణ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు.

కానీ.. పవన్ కల్యాణ్ ఇప్పుడో విషయం గుర్తు పెట్టుకోవాలి. సహనం మంచిదే.. అందులో ఎలాంటి అనుమానమూ లేదు. వెనక గోతులు తవ్వేవారు, దెబ్బతీయాలని చూసేవారి విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండడం ఎంతైనా అవసరం అనేది రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్న సలహా.