బీసీసీఐలో విభేదాలు

22 July, 2019 - 9:39 PM

       (న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: క్రికెటర్లతో పాటుగా వారి  సతీమణులు, ప్రియసఖుల ప్రయాణం విషయంలో బీసీసీఐలో విభేదాలు తలెత్తాయి. సతీమణి, ప్రియసఖి ప్రయాణాలపై నిర్ణయం చెప్పాలని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ప్రధాన కోచ్‌ రవిశాస్త్రిని సుప్రీం నియమిత పరిపాలకుల కమిటీ (సీఓఏ) కోరడాన్ని బీసీసీఐ అధికారులు, మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎమ్‌ లోధా తప్పబట్టారు. ప్రపంచకప్‌ సందర్భంగా నిబంధనలను అతిక్రమించి తన భార్యను వెంట ఉంచుకున్నాడని ఓ సీనియర్‌ క్రికెటర్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సతీమణుల ప్రయాణ షెడ్యూల్‌పై బీసీసీఐ అధికారుల మధ్య విభేదాలు చెలరేగడం చర్చనీయాంశంగా మారింది. ఆటగాళ్ల మధ్య గొడవలు అంటూ వచ్చిన కథనాలను పట్టించుకోనప్పుడు.. ఓ సీనియర్‌ ఆటగాడిపై వచ్చిన ఆరోపణలను ఇంత వేగంగా సమీక్షించాల్సిన అవసరం ఏంటని ఓ బీసీసీఐ అధికారి ప్రశ్నించారు.కాగా.. సతీమణుల ప్రయాణ షెడ్యూల్‌పై వింత నివేదికలు రావడం బీసీసీఐ అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. క్రికెటర్లతో సతీమణులను అనుమంతించే సమయం ఆటగాళ్లను బట్టి ఉంటుందని, ఈ నేపథ్యంలో మళ్లీ  కెప్టెన్‌, కోచ్‌లకే ఆ అధికారాన్ని కల్పించడం సమంజసం కాదనే అభిప్రాయం వెల్లడవుతోంది. మరోవైపు సతీమణుల ప్రయాణ విషయంలో ఇలా భేదాభిప్రాయాలు రావడం భారత క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి అని బీసీసీఐ అధికారులు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.