ఏపీలోని ప్రధాన ఆలయాల్లో క్షురకుల ‘కత్తి డౌన్’

15 June, 2018 - 11:24 AM

(న్యూవేవ్స్ డెస్క్)

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన ఆలయాల్లోని కేశఖండల శాలల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులు తమ డిమాండ్ల సాధన కోసం శుక్రవారం మెరుపు ఆందోళనకు దిగారు. తిరుపతి మినహా అన్ని ప్రధాన ఆలయాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచీ ‘కత్తి డౌన్‌’ నిరసన చేపట్టారు. దేవాలయాల్లోని కేశఖండనశాలల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణలకు కనీస వేతనం రూ.15 వేలు ఇచ్చి తక్షణమే పర్మినెంట్ చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ విమరణ చేసిన వారికి నెలకు రూ.5 వేలు పెన్షన్‌ ఇవ్వాలని నాయీ బ్రాహ్మణులు కోరుతున్నారు.

విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లన్న, అరసవల్లి సూర్యనారాయణస్వామి, అన్నవరం సత్యనారాయణస్వామి, సింహాచలం అప్పన్న, ద్వారకా తిరుమల, కాణిపాకం, ప్రెనుగంచిప్రోలులోని శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయం తదితర దేవాలయాల్లో భక్తులకు తలనీలాలు తీయకుండా క్షురకులు నిరసన తెలుపుతున్నారు. దీంతో తమ మొక్కులు ఎలా తీరాలంటూ భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని ఆలయాల్లోని కేశఖండన శాలల ముందు బైఠాయించిన క్షురకులు తమ డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేస్తూ, ధర్నా నిర్వహిస్తున్నారు. విజయవాడ దుర్గగుడిలో కురక్షుడి పట్ల అనుచితంగా ప్రవర్తించిన బోర్డు సభ్యుడిపై చర్య తీసుకోవాలని వారంతా డిమాండ్‌ చేస్తున్నారు.

రెండు వారాల క్రితం దుర్గగుడిలోని ఓ క్షురకునిపై పాలకమండలి సభ్యుడు పెంచలయ్య చెయ్యి చేసుకున్న ఘటన కలకలం రేపింది. పెంచలయ్యపై చర్యలు తీసుకోలేదని క్షురకులు ఆరోపిస్తూ ఈ ఉదయం ధర్నాకు దిగారు. మూడు రోజులుగా నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న క్షురకులు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఈ రోజు విధులు బహిష్కరించారు. తమకు పాలకమండలి చైర్మన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వారు ఆరోపించారు. స్థిర వేతనాలు తమకు లేవని, తలనీలాలు తీసిన అనంతరం భక్తులు సంతృప్తితో ఇచ్చే చిల్లర కూడా తీసుకోనివ్వడం లేదని వారు ఆరోపిస్తూ ధర్నాకు ప్రారంభించారు.ఇదే సమయంలో మిగతా దేవాలయాల క్షురకులు మూకుమ్మడిగా వారికి సంఘీభావం తెలిపి తమ డిమాండ్ల సాధనకు నడుం బిగించారని తెలుస్తోంది. నాయీ బ్రాహ్మణులు ఆందోళనకు దిగడంతో కేశఖండన శాలలు బోసిబోయాయి. తలనీలాలు సమర్పించేందుకు వస్తున్న భక్తులు వెనుదిరగాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు. మరో పక్కన కలియుగ వైకుంఠం తిరుమలలో కూడా శనివారం నుంచి కేశఖండన నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్దవటం యానాదయ్య తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌‌లో క్షురకుల ఆందోళనకు తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక మద్దతు తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాల్లో పనిచేస్తున్న క్షురకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, పర్మినెంట్‌ చేయాలని ఐక్యవేదిక అధ్యక్షుడు ఎం. లింగం నాయీ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. తమకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

శ్రీశైల దేవస్థానం కళ్యాణకట్టలో పనిచేసే క్షురకులు తమ డిమాండ్లను పరిశీలించాలంటూ విధులు బహిష్కరించారు. 150 మంది క్షురకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర దేవాలయాల నాయీబ్రహ్మణ సంఘ ఐకాస పిలుపు మేరకు క్షురకులు కళ్యాణకట్ట వద్ద బైఠాయించారు. గడచిన 30 ఏళ్ల నుంచి కనీస వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాలను కోరుతున్నప్పటికీ తమ సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.