విండీస్‌ను ఉతికేసిన బంగ్లాదేశ్

18 June, 2019 - 8:12 AM

      (న్యూవేవ్స్ డెస్క్)

టాంటన్‌: ఐసీసీ ప్రపంచకప్‌ 2019లో కూడా వెస్టిండీస్‌పై బంగ్లాదేశ్ విరుచుకుపడింది. విండీస్ పటిష్టమైన ప్రత్యర్థే అయినా.. భారీ స్కోర్ కళ్ళ ముందరే ఉన్నా.. బంగ్లాదేశ్‌ చకచకా ఛేదించింది. ఇంకా 8.3 ఓవర్లు మిగిలి ఉండగానే విండీస్‌ భరతం బంగ్లాదేశ్ పట్టింది. ఈ మెగా ఈవెంట్‌లోనే అసాధారణ ఫామ్‌లో ఉన్న షకీబ్‌ అల్‌ హసన్‌ (99 బంతుల్లో 124 నాటౌట్‌) అజేయ సెంచరీతో జట్టును గెలిపించేదాకా పోరాడాడు. అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చిన లిటన్‌ దాస్‌ (69 బంతుల్లో 94 నాటౌట్‌) ఈ గెలుపులో భాగం పంచుకున్నాడు. దీంతో విండీస్‌పై బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో జయకేతనం ఎగరేసింది.

మొదట వెస్టిండీస్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగుల భారీస్కోరు చేసింది. షై హోప్‌ (121 బంతుల్లో 96), లూయిస్‌ (67 బంతుల్లో 70), హెట్‌మైర్‌ (26 బంతుల్లో 50) విండీస్‌ ఇన్నింగ్స్‌లో రాణించారు. బంగ్లా బౌలర్లలో సైఫుద్దీన్, ముస్తఫిజుర్‌ రహ్మాన్‌ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత భారీ లక్ష్యాన్ని బంగ్లాదేశ్‌ 41.3 ఓవర్లలోనే 3 వికెట్లే కోల్పోయి ఛేదించింది. అజేయ సెంచరీతో పాటు రెండు వికెట్లు కూడా తీసిన షకీబ్‌ ‘ప్లేయర్ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు.

టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా ఫీల్గింగ్‌ తీసుకుంది. ఓపెనింగ్‌ భాగస్వామ్యం గేల్‌ (13 బంతుల్లో 0)తో విఫలమైనా.. మరో ఓపెనర్‌ లూయిస్, షై హోప్‌ ఇన్నింగ్స్‌ను పటిష్టపరిచే భాగస్వామ్యం నెలకొల్పారు. 24 ఓవర్ల పాటు బంగ్లా బౌలర్లను తిప్పలు పెట్టారు. ఈ క్రమంలో లూయిస్‌ 58 బంతుల్లో.. తర్వాత హోప్‌ 75 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తిచేశారు. రెండో వికెట్‌కు 116 పరుగులు జోడించాక లూయిస్‌ను షకీబ్‌ ఔట్‌ చేశాడు. దీంతో హోప్‌కు  పూరన్‌ (30 బంతుల్లో 25) తోడయ్యాడు. క్రీజులో పాతుకుపోతున్న దశలో పూరన్‌ను షకీబే పెవిలియన్‌కు పంపించాడు. రసెల్‌ (0) డకౌటైనా.. హెట్‌మైర్‌ విధ్వంసం సృష్టించాడు. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్‌ హోల్డర్‌ (15 బంతుల్లో 33) ధాటిగా ఆడాడు. ముస్తఫిజుర్‌ బౌలింగ్‌లో లిటన్‌ దాస్‌ క్యాచ్‌ పట్టడంతో హోప్‌ నాలుగు పరుగుల తేడాతో సెంచరీకి దూరమయ్యాడు.వెస్టిండీస్‌ బౌలింగ్‌ చూస్తే 322 పరుగుల లక్ష్యం కష్టతరమైందే! కానీ ప్రత్యర్థిపై ఇటీవలి రికార్డు, షకీబ్‌ అల్‌ హసన్‌ వరల్డ్‌కప్‌ ఫామ్‌ అద్భుతంగా ఉండటంతో సీన్‌ మారిపోయింది. దీనికి తగ్గట్లుగానే ఓపెనర్లు సౌమ్య సర్కార్‌ (23 బంతుల్లో 29), తమీమ్‌ ఇక్బాల్‌ (53 బంతుల్లో 48) బీజం వేశారు. తొలి వికెట్‌కు చకచకా 52 పరుగులు జోడించారు. సర్కార్‌ ఆట ముగిశాక వచ్చిన షకీబ్‌ తన జోరు కొనసాగించాడు. రన్‌ రేట్‌ పడిపోకుండా తమీమ్, షకీబ్‌ జోడీ జాగ్రత్త పడింది. దీంతో 13.5 ఓవర్లలోనే జట్టు స్కోరు 100 పరుగులు చేరింది. రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించాక తమీమ్‌ రనౌటయ్యాడు. ముష్ఫికర్‌ (1) విఫలమయ్యాడు.

అప్పటికి 19 ఓవర్లలో బంగ్లాదేశ్‌ జట్టు స్కోరు 133/3.  బంగ్లాదేశ్‌కు గెలిచేందుకు 189 పరుగులు కావాలి. మిథున్‌ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన లిటన్‌ దాస్‌.. షకీబ్‌కు జత కలిశాడు. ఇద్దరూ చెలరేగారు. చూస్తుండగానే 30 ఓవర్ల కంటే ముందే జట్టు స్కోరు 200 (29 ఓవర్లలో) పరుగులు దాటింది. షకీబ్‌ 83 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ టోర్నీలో అతనికిది రెండో సెంచరీ. లిటన్‌ దాస్‌ 43 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. గాబ్రియెల్‌ వేసిన 38వ ఓవర్లో లిటన్‌ హ్యాట్రిక్‌ సిక్స్‌లు కొట్టాడు. షకీబ్‌ బౌండరీ బాదడంతో ఈ ఓవర్లోనే 24 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌కు ముందు 79 బంతుల్లో 52 పరుగులుగా ఉన్న లక్ష్యం కాస్తా 72 బంతుల్లో 28 పరుగులుగా మారిపోయింది. అభేద్యమైన నాలుగో వికెట్‌కు 189 పరుగులు జోడించి షకీబ్, లిటన్‌ బంగ్లాకు సంచలన విజయాన్ని అందించారు.