థియేటర్లలో ‘ఎన్టీఆర్’

07 January, 2019 - 6:09 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్. ఈ బయోపిక్‌ రెండు భాగాలుగా వస్తుంది.. ఒకటి ఎన్టీఆర్ కథనాయకుడు, మరొకటి ఎన్టీఆర్ మహానాయకుడు. ఈ రెండు చిత్రాల్లో ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ఒదిగిపోయి నటిస్తున్నారు.

మొదటి భాగం జనవరి 9వ తేదీ అంటే బుధవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఎన్టీఆర్ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో 100 విగ్రహాలను పలు థియేటర్లలో ఏర్పాటు చేయనున్నారు. అందుకు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయినాయి. అలాగే ఎన్టీఆర్ మహానాయకడు చిత్రం ఫిబ్రవరి 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ఎన్టీఆర్ బయోపిక్‌ విడుదలవుతున్న నేపథ్యంలో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

ఎన్టీఆర్ బయోపిక్ … శాటిలైట్ చానల్స్ హక్కులు రూ. 25 కోట్లకు జెమిని పిక్చర్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎన్టీఆర్ భార్యగా బాలీవుడు ప్రముఖ నటి విద్యా బాలన్ నటిస్తుంది. అలాగే రకుల్ ప్రీత్ సింగ్, నిత్య మీనన్, మోహన్ బాబు, సుమంత్, రానా దగ్గుబాటి, భరత్ రెడ్డి నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి నందమూరి బాలకృష్ణ, విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

జనవరి 8న ఎన్టీఆర్ బయోపిక్ విడుదలవుతున్న నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, క్రిష్, నందమూరి కళ్యాణ్ రామ్, సుమంత్‌లు నిమ్మకూరు, బెంగళూరు, తిరుపతిలో సోమ, మంగళవారాలు పర్యటిస్తున్నారు.