లండన్ ‘టుస్సాడ్’లో కట్టప్ప విగ్రహం!

12 March, 2018 - 5:03 PM

(న్యూవేవ్స్ డెస్క్)

చెన్నై: సీనియర్‌ నటుడు సత్యరాజ్‌‌కు అరుదైన గౌరవం దక్కింది. లండన్‌‌లోని ప్రతిష్ఠాత్మక మేడం టుసాడ్స్‌ మ్యూజియంలో ‘కట్టప్ప’ మైనపు విగ్రహాన్ని పెడుతున్నారు. సత్యరాజ్‌ సినీ కెరీర్‌‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయిన పాత్ర ‘కట్టప్ప’. సత్యరాజ్ నటించిన అన్ని చిత్రాలు ఒక ఎత్తయితే.. ‘బాహుబలి’ మరో ఎత్తు. మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టుబానిస అయిన కట్టప్ప పాత్రలో సత్యరాజ్‌ను తప్ప మరొకర్ని ఊహించుకోలేమంటే అతిశయోక్తి కాదు. అంతగా ఆ పాత్ర ప్రేక్షకులకు దగ్గరైంది.
‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ అనే ప్రశ్న ప్రథమార్ధం ‘బాహుబలి’ విడుదల తర్వాత సినీ అభిమానుల్ని వెంటాడింది. ఆ తర్వాత ‘బాహుబలి 2’తో ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది.

కాగా ‘బాహుబలి’లో ‘అమరేంద్ర బాహుబలి’, ‘మహేంద్ర బాహుబలి’గా నటించి, మెప్పించిన ప్రభాస్‌ మైనపు విగ్రహాన్ని ఇప్పటికే లండన్‌‌ మేడం టుసాడ్స్‌ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. సత్యరాజ్‌ విగ్రహాన్ని కూడా త్వరలోనే పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని సత్యరాజ్‌ కుమారుడు, నటుడు సిబిరాజ్‌ సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. ఈ ఘనతను సొంతం చేసుకుంటున్న తొలి తమిళ నటుడు తన తండ్రి సత్యరాజ్‌ కావడం చాలా గొప్పగా ఉందంటూ సిబిరాజ్ సంతోషం వ్యక్తం చేశారు.

ఇదే సందర్భంగా సినీ నటులు ఖుష్బూ, మహేంద్రన్‌, ప్రసన్న తదితరులు సత్యరాజ్‌‌కు శుభాకాంక్షలు చెప్పారు. ఇది గర్వించదగ్గ తరుణం అని ట్వీట్లు చేశారు. సత్యరాజ్‌ను ‘కట్టప్ప’గా ఈ స్థాయిలో వెండితెరపై చూపించిన దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళిని, చిత్ర బృందాన్ని ప్రశంసించారు. బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా విజయ ఢంకా మోగించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాల ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి పెరిగింది.