తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

11 October, 2018 - 6:45 PM

 

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల నియామకాన్ని సవాల్‌ చేస్తూ ఇటీవల కొందరు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

గడువు ముగిసిన పంచాయతీలకు ప్రభుత్వ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులను నియమించడం చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ హైకోర్టు విచారించింది. అందులోభాగంగా కోర్టు.. పిటిషనర్ల వాదనలతో ఏకీభవిస్తూ తీర్పు వెలువరించింది.

పంచాయతీలకు మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోకపోవడం, ఓటర్ల జాబితా సిద్ధం చేయకపోవడంపై కోర్టు తప్పు బట్టింది.

మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించేంత వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుందని.. ఎన్నికల ప్రక్రియ వారి ద్వారానే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు ఆదేశించింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి అని.. వివిధ కారణాలతో వాటిని వాయిదా వేయడం అనేది సరైన చర్య కాదని హైకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది.