‘ఆంధోల్ నుంచే మళ్లీ పోటీ చేస్తా’

11 October, 2018 - 3:09 PM

(న్యూవేవ్స్ డెస్క్)

సంగారెడ్డి: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్.. తనకు చాలా ఇష్టమని… ఆయన్ని తాను గాడ్ ఫాదర్‌గా భావిస్తానని ఆంధోల్ మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్ తెలిపారు. అలాంటి వ్యక్తి తనను నడిరోడ్డుపై వదిలేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సంగారెడ్డిలోని బీజేపీ కార్యాలయంలో బాబూ మోహన్ విలేకర్లతో మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి వచ్చింది కేసీఆర్ వల్లేనని… ఆయన ఎటు వైపు వెళ్తే అటు వైపు ఉన్నానని ఆయన గుర్తు చేశారు.

25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తనను కాదని.. మరొకరికి ఎమ్మెల్యే టిక్కెట్ కేటాయించడంతో తాను తీవ్ర కలత చెందానని చెప్పారు. అయినా సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనను సంప్రదించకుండా మరో వ్యక్తికి టిక్కెట్ కేటాయించి కేసీఆర్ తనను మోసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తన రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా జీవించానని.. టిక్కెట్‌ కోసం ఫాంహౌస్‌, ప్రగతిభవన్‌ చుట్టూ తిరగలేదన్నారు. అయితే తన సేవలను బీజేపీ గుర్తించిందన్నారు. అందుకే ఆ పార్టీ తనను ఆహ్వానించిందని తెలిపారు. బీజేపీ అభ్యర్థిగా ఆంధోల్‌ నుంచి పోటీ చేయనున్నట్లు బాబూ మోహన్ క్లారిటీగా తెలిపారు.