అమెరికా వనదేవత కనువిందు..!

01 November, 2019 - 2:22 AM

(డి.వి.రాధాకృష్ణ)

క్లార్క్స్‌బర్గ్ (మేరీల్యాండ్- అమెరికా): ఎండాకాలం ముగిసిపోయింది. నార్త్ అమెరికా, ఐరోపా, ఆసియా ఖండాల్లో ఆహ్లాదం కలిగించే శరదృతువు (ఆకు రాలే కాలం) ప్రారంభం అయింది. ప్రకృతిని ప్రేమించే వారు.. కనువిందు చేసే సుందరమైన ఫాల్ కలర్స్ కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూసే కాలం అక్టోబర్, నవంబర్ నెలలు. పసుపు, కుంకుమ రంగులు.. ఎరుపు, పచ్చ రంగులు.. నారింజ, బంగారు వర్ణాలు.. జేగురుమన్ను (పర్పుల్) కలర్.. అమెరికా అందాలకు మరింత వన్నె తెచ్చిన ప్రకృతి చిహ్నాలు..

శరదృతువు ఆరంభ సూచికగా ఇలా అమెరికా తూర్పు తీరంలోని ఇంచుమించి అన్ని నగరాలు, పట్టణాలు, కొండలు కోనల్లో, నదీతీరాల్లో ఇప్పుడు దర్శనం ఇస్తున్న సుందర దృశ్యాలివి. ప్రతి ఏటా శరదృతువులో అంటే ఆకులు రాలిపోయే కాలానికి ముందు కనువిందు చేస్తున్న వర్ణాలివి. కొద్ది రోజుల క్రితమే నేను అమెరికాలో సందర్శించిన పెన్సిల్వేనియాలోని పొకొనొ హిల్స్, అమెరికాలో మొట్టమొదటి సారిగా పిట్స్‌బర్గ్‌లో నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, మేరీల్యాండ్, వాషింగ్టన్ డీసీ, వర్జీనియా, నార్త్ కరోలినా, న్యూజెర్సీ, న్యూయార్క్‌లలో కన్నార్పకుండా పులకింపజేసిన ప్రకృతి సోయగాలు. వీటినే ఫాల్ కలర్స్ అంటారు. అంటే శరదృతువులో చెట్ల ఆకులన్నీ రాలిపోతాయి. అలా రాలిపోయే ముందు ఒక్కో చెట్టు ఆకులు ఒక్కో రంగులోకి మారిపోతాయి. పసుపు, ఎరుపు, కుంకుమ, నారింజ, పచ్చ రంగుల ఆకులతో నిండిన చెట్లు పక్కపక్కనే ఉన్న దృశ్యాల్ని చూసి తీరాల్సిందే.. సాధారణంగా ఈ ఫాల్స్ కలర్స్ సోయగాలు ప్రతి ఏడాది సెప్టెంబర్ ఆఖరి వారంలో మొదలై.. అక్టోబర్ మూడో వారంతో ముగిసిపోతాయి.

ఫాల్ కలర్స్ అందాల్ని మరింత ఆహ్లాదంగా అనుభవించాలంటే.. పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఉన్న ‘పీఏ రౌట్ 6’ మార్గంలో ప్రయాణించి తీరాల్సిందే.. అమెరికా మొత్తంలో అత్యుత్తమ సుందరమైన రౌట్లలో ఇది అగ్రస్థానంలో నిలుస్తుంది. ఈ రౌట్లో ఫాల్ కలర్స్ సమయంలో ప్రయాణిస్తే వచ్చే కిక్కు గురించి ఎంత చెప్పినా తక్కువనే చెప్పాలి. ఆ తర్వాతి స్థానంలో డెలావేర్ వాటర్ గ్యాప్‌కు వెళ్ళే రౌట్ 209 కూడా ప్రకృతి సోయగాలకు ప్రసిద్ధి చెందింది.

అమెరికాలోని సరస్సులు, వాటి ఒడ్డున చుట్టూ ఉండే వివిధ రకాల చెట్లు.. రంగులు మారిన వాటి ఆకులు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. చలికాలం ప్రారంభం సూచికగా ఈ రంగు రంగుల దృశ్యాలు మనకు దర్శనం ఇస్తాయి. ఏటి ఒడ్డున, సరస్సుల చుట్టూ, కొండవాలుల్లో ఆవరించిన చెట్లను, అక్కడి దృశ్యాలను, వాతావరణాన్ని చూసి తీరాల్సిందే.అమెరికాలో నివసించే వారు శీతాకాలం వచ్చిందంటే.. ఎంతలా బోర్ ఫీలవుతారో.. ఎండాకాలంలో అంత స్వేచ్ఛగా.. ఆనందంగా గడిపేస్తారనడంలో అతిశయోక్తి లేదు. ఎండాకాలం ముగింపు.. ఆకురాలు కాలం ప్రారంభానికి మధ్య ఈ ఫాల్ కలర్స్ కనువిందు చేస్తాయి. నిజానికి వేసవి కాలాన్ని ఎంతో ఎంజాయ్ చేసిన అమెరికా వాసులు ఈ ఫాల్ కలర్స్ మొదలైనప్పుడు చూడచక్కని దృశ్యాలు దర్శనమిచ్చే ప్రాంతాలకు వారాంతపు పిక్నిక్‌లు వేసుకుంటారు. కుటుంబాలకు కుటుంబాలు, స్నేహితులతో కలిసి క్యాంపులు నిర్వహించుకుని రెండేసి మూడేసి రోజులు ఫాల్ కలర్స్ సౌందర్యాలను తనివితీరా అనుభవిస్తారు. శరదృతువు మొదలై చెట్ల ఆకులు రాలిపోయి.. మార్చి, ఏప్రిల్ నెలలు వచ్చే సరికి అవి మోడువారిపోతాయి. ఎండాకాలం అంతా పచ్చని ఆకులతోనూ, సెప్టెంబర్, నవంబర్ నెల మొదట్లో ఫాల్ కలర్స్‌తోనూ ఆహ్లాదాన్ని కలిగించిన చెట్లు నవంబర్ చివారి వారాలు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో కొద్ది రోజుల వరకూ ఆకులే లేకుండా మోడువారిపోతాయి. ఈ దశను ఒక విధంగా పుడమి నొప్పులు అనుకోవచ్చేమో.

పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పొకొనొ హిల్స్‌ ప్రకృతి సోయగాలకు మరింత ప్రసిద్ధి చెందింది. ఈ పొకొనొ హిల్స్ మొత్తం నాలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. అమెరికాలోని నయాగరా జలపాతం పర్యాటకులను ఆకర్షించడంలో మొదటి స్థానంలో ఉంటే.. ఆ తర్వాతి స్థానంలో పొకొనొ హిల్స్‌లోని కార్బన్ కౌంటీలో ఉన్న జిమ్ థోర్ప్ పట్టణం. ఈ పట్టణం చుట్టూ కొండలతో ఆవరించి ఉన్న ఈ పట్టణం చక్కని కళా సంపదతో, ప్రకృతి అందాలతో అలరారుతుంది. అందుకే దీన్ని ‘స్విట్జర్లాండ్ ఆఫ్ అమెరికా’ అని కూడా పిలుస్తారు. అలాగే గేట్‌వే ఆఫ్ పొకొనొ హిల్స్‌గా జిమ్ థోర్ప్ ప్రసిద్ధి చెందింది. జిమ్ థోర్ప్‌ నుంచి ఓ అరగంట పాటు జరిగే ‘లే హై జార్జి సీనిక్ రైల్వే ట్రైన్ రైడ్’ చేసి తీరాల్సిందే. ఒక పక్కన కొండ.. మరో పక్కన నిండుగా నీటితో ప్రవహించే నది.. ఆ నదికి ఆవల గుబురు చెట్లతో నిండి ఉండే మరో కొండ.. ఇలా రెండు పర్వతాల మధ్య నదికి ఎగువన సుమారు ఇరవై మైళ్ళు కొనసాగే ట్రైన్ జర్నీ మనల్ని మరో లోకంలోకి తీసుకుపోతుంది. ఏటి గలగలలు, రంగు రంగుల చెట్ల ఆకులు, ఆ చెట్ల కింద స్వేచ్ఛగా తిరుగాడే లేళ్ళు, జింకలు, ఇతర జంతువులు, పలు రకాల పక్షులతో ట్రైన్ రైడ్ మొత్తం ఆనందంగా గడిచిపోతుంది. మొదట్లో ఈ పట్టణం పేరు మాచ్ చుంక్ (Mauch Chunk). ప్రసిద్ధ అథ్లెట్, ఒలింపిక్ పతక విజేత జిమ్ థోర్ప్ మరణించిన తర్వాత 1953లో ఈ పట్టణానికి ఆ పేరు పెట్టారు.

ఇక శరదృతువులోనే ప్రపంచంలో సందర్శించ దగ్గ ఆరు దేశాల్లోని ప్రదేశాలివీ.. జపాన్‌లోని క్యోటో నగరం ఇప్పుడు కెంపు వర్ణం (క్రిమ్సన్ రెడ్)లోకి మారిపోయింది. ‘సిటీ ఆఫ్ టెన్ థౌజండ్ ష్రైన్స్‌’గా ప్రసిద్ధి చెందిన ఈ నగరం మొత్తం ఎరుపు, పసుపు, పచ్చ రంగులతో అలరారుతోంది. ఫాల్ సీజన్‌లో అమెరికాలోని నార్త్ కరోలినా (ఎన్‌సీ), మెయిన్, వెర్మాంట్, న్యూ హాంప్‌షైర్, మసాచుసెట్స్, రోడ్ ఐలాండ్, కనెక్టికట్ రాష్ట్రాలు చూడచక్కని సింధూర వర్ణం, ఊదారంగు, ఆరెంజ్, పసుపు, పచ్చ, బంగారు రంగుల చెట్ల ఆకులతో కనువిందు చేస్తున్నాయి. ఈ ప్రాంతాల్లోని సుందరమైన ఫాల్ కలర్స్‌ వర్జీనియా నుంచి మొదలై నార్త్ కరోలినాలోని చెరోకీ నగరం వరకూ వ్యాపించి ఉన్నాయి. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా నగరం కూడా ఫాల్ కలర్స్ అందాలకు ప్రసిద్ధి చెందింది. అందమైన ప్రకృతి దృశ్యాలకు బ్రిటిష్ కొలంబియా ప్రాంతం పెట్టింది పేరు. శరదృతువులో ఇక్కడ కూడా ఫాల్ కలర్స్ ప్రకృతి ప్రేమికుల్ని మేజిక్ చేసినట్టుగా మైమరపిస్తాయి. ఇంగ్లండ్‌లోని లేక్ డిస్ట్రిక్ట్ కూడా శరత్కాలంలో పర్యాటకులు చూడచక్కని ప్రదేశం. ఇక్కడ ఆవరించి ఉన్న అనేక సరస్సులు, వాటి ఒడ్డున ఉండే చెట్లు, కొండలు ఈ కాలంలో కలర్‌ఫుల్‌గా మారిపోతాయి.శరదృతువులోనే మరో చూడచక్కని ప్రదేశం ఫ్రాన్స్‌లోని లోయిర్ వ్యాలీ. ఫాల్ కలర్స్ సమయంలో సహజసిద్ధమైన ఇక్కడి అందాల్ని తనివితీరా ఆస్వాదించేందుకు పర్యాటకులు తండోపతండాలుగా తరలివస్తారు. ఉత్తర ఇటలీలో ఉన్న లాంబార్డీ కూడా ఫాల్ కలర్స్ సమయంలో చూసి తీరాల్సిన ప్రాంతమే. జర్మనీలోని బవరియా ఫాల్ సీజన్‌లో చూడముచ్చటగా మారిపోతుంది. చెట్లన్నీ రకరకాల రంగుల ఆకులతో కనువిందు చేస్తాయి. రొమేనియాలోని ట్రాన్సిల్వేనియా ఫాల్స్ కలర్స్‌కు ప్రసిద్ధి చెందిందే. చైనాలోని జియుజైగు వ్యాలీ ఫాల్ కలర్స్ సమయంలో అత్యంత సుందరంగా మారిపోతుంది. శరదృతువులో ఈ లోయ ఎరుపు, ఆరెంజ్, పచ్చని రంగులతో కళకళలాడుతూ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.