తొలి వన్డేలో భారత్ లక్ష్యం 289 రన్స్

12 January, 2019 - 12:23 PM

(న్యూవేవ్స్ డెస్క్)

సిడ్నీ: తొలి వన్డేలో భారత క్రికెట్ జట్టుకు ఆస్ట్రేలియా 289 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్‌ జట్టులో ఉస్మాన్‌ ఖవాజా (59), షాన్‌ మార్ష్‌ (54), హ్యాండ్ స్కాంబ్‌ (73)లు హాఫ్‌ సెంచరీలతో రాణించారు. దీంతో పాటు మార్కస్‌ స్టోనిస్‌ (47 నాటౌట్‌ ) బ్యాట్‌ ఝళిపించాడు. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌‌కు ముందులోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ అరోన్‌ ఫించ్‌ (6) మూడో ఓవర్‌‌లోనే ఔటయ్యాడు. భువనేశ్వర్‌ బౌలింగ్‌‌లో బౌల్డ్‌ కావడంతో ఆసీస్‌ ఎనిమిది పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆపై అలెక్స్‌ క్యారీ (24), ఖవాజాల జోడి ఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ 33 పరుగులు జత చేసిన తర్వాత క్యారీ రెండో వికెట్‌‌గా కుల్దీప్ బౌలింగ్‌లో ఔటై పెవిలియన్‌ చేరాడు.

తర్వాత షాన్‌ మార్ష్‌-ఖవాజాల జంట క్రీజు వద్ద పాతుకుని నిలకడగా బ్యాటింగ్‌ చేసింది. ఈ జోడి మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో ఖవాజాను జడేజా ఔట్‌ చేసి భారత్‌ మంచి ఊపిరి ఇచ్చాడు. ఆసీస్‌ జట్టు మరో 53 పరుగులు జోడించిన తర్వాత మార్ష్‌‌ను కుల్దీప్‌ యాదవ్‌ మైదానం వీడేలా చేశాడు. కుల్దీప్‌ బౌలింగ్‌‌లో మార్ష్‌ భారీ షాట్‌‌కు యత్నించగా లాంగాన్‌‌లో మహ్మద్‌ షమీ క్యాచ్‌ పట్టాడు. దాంతో ఆసీస్‌ 186 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ చేజార్చుకుంది.

ఆ సమయంలో హ్యాండ్‌ స్కాంబ్‌ బాధ్యతాయుతంగా ఆడుతూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. అతనికి మార్కస్‌ స్టోనిస్‌ చక్కటి సహకారం అందించాడు. దాంతో ఆసీస్‌ 42వ ఓవర్‌‌లో రెండు వందల పరుగుల మార్కుకు ఆసీస్ చేరింది. ప్రధానంగా కుల్దీప్‌ వేసిన 44వ ఓవర్‌‌లో స్టోనిస్‌-హ్యాండ్‌ స్కాంబ్‌‌లు తలో సిక్సర్‌ కొట్టడంతో స్కోరులో వేగం పెరిగింది. భువనేశ్వర్‌ వేసిన 46వ ఓవర్‌‌లో వీరిద్దరూ చెరో ఫోర్‌ కొట్టారు. ఆపై భువీ వేసిన 48 ఓవర్‌‌లో తొలి బంతిని సిక్స్‌ కొట్టిన హ్యాండ్‌ స్కాంబ్‌ మరుసటి బంతికి ఔటయ్యాడు. మరోసారి భారీ షాట్‌‌కు ప్రయత్నించి శిఖర్‌ ధావన్‌‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. చివరి రెండు ఓవర్లలో 29 పరుగులు రావడంతో ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 288 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఆఖరి పది ఓవర్లలో కేవలం వికెట్‌ మాత్రమే తీసిన భారత జట్టు 93 పరుగుల్ని ఆసీస్‌కు ఇచ్చుకుంది. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌‌లు చెరో రెండు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజాకు వికెట్ లభించింది.