బంగ్లాపై 48 రన్స్‌తో ఆసీస్ విజయం

21 June, 2019 - 1:41 AM

(న్యూవేవ్స్ డెస్క్)

ట్రెంట్‌బ్రిడ్జ్‌ (ఇంగ్లండ్): బంగ్లాదేశ్‌ క్రికెట్ జట్టు మరోసారి తన పోరాటపటిమతో అభిమానులను ఆకట్టుకుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌, అన్ని రంగాల్లో తన కంటే బలమైన ఆస్ట్రేలియాపై గెలిచేంత పనిచేసింది. ప్రపంచకప్‌లో భాగంగా ఆసీస్‌తో ట్రెంట్‌బ్రడ్జిలో గురువారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశం 48 పరుగుల తేడాతో ఓడిపోయింది. బంగ్లా బ్యాట్స్‌మెన్‌ చివర్లో కాస్త కంగారు పెట్టినా.. విజయం మాత్రం ఆస్ట్రేలియానే వరించింది. దీంతో ఈ ప్రపంచకప్‌లో ఆసీస్‌ విజయాల సంఖ్య ఐదుకు చేరుకుంది. మొత్తం 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్ జట్టు నిలిచింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై వీరవిహారం చేసి, భారీ శతకం సాధించిన డేవిడ్‌ వార్నర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

టాస్ గెలిచి, ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 381 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (166- 147 బంతుల్లో 14×ఫోర్లు, 5సిక్స్‌లు) భారీ శతకంతో రెచ్చిపోయాడు. వార్నర్‌తో పాటు ఖవాజా (89- 72 బంతుల్లో), ఆరోన్ ఫించ్‌ (53- 51 బంతుల్లో) అర్ధ శతకాలతో రాణించారు. దీంతో బంగ్లాదేశ్ ముందు ఆసీస్‌ భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. బంగ్లాదేశ్‌ బౌలర్లలో సౌమ్య సర్కార్‌ మూడు, ముస్తాఫిజుర్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. ఆస్ట్రేలియాకు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్‌ అదిరే ఆరంభం ఇచ్చారు. తొలి నాలుగు ఓవర్లు కొద్దిగా ఆచితూచి ఆడిన ఈ జోడీ ఐదో ఓవర్‌ నుంచి బ్యాటింగ్‌లో టాప్ గేర్‌ వేశారు. మోర్తాజా వేసిన ఈ ఓవర్‌ తొలి బంతినే సిక్సర్‌గా మలచి ఫించ్‌ తన ఉద్దేశాన్ని చాటాడు. అయితే.. ఇదే ఓవర్‌ చివరి బంతికి వార్నర్‌ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అతడిచ్చిన క్యాచ్‌ను పాయింట్‌లో షబ్బీర్‌ నేలపాలు చేశాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వార్నర్‌ ఆ తర్వాత చెలరేగిపోయాడు. చకచకా బౌండరీలు, సిక్స్‌లు బాదుతూ బంగ్లా పనిపట్టేశాడు.ఇలా ఉండగా.. ఈ టోర్నీ మొదటి నుంచీ దూకుడుగా ఆడుతున్న బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మెన్‌ ఈ మ్యాచ్‌లో కూడా అదే స్పిరిట్‌తో ఆడారు. ఆసీస్‌ నిర్దేశించిన 382 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది. ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయినా ముష్ఫికర్‌ రహీం (102 నాటౌట్- 97 బంతుల్లో 9×4, 1×6) అసాధారణ రీతిలో ఆసీస్‌పై పోరాడి ఔరా అనిపించుకున్నాడు. మహ్మదుల్లా (69- 50 బంతుల్లో 5×4, 3×6)తో కలిసి బంగ్లాను ఇంచుమించుగా గెలిపించినంత పని చేశారు. తమీమ్ (62), సీనియర్ ఆటగాడు షకీబ్ (41). లిట్టన్ దాస్ (20) పరుగులు చేశారు. కానీ ఆసీస్‌ బౌలర్లు పకడ్బందీగా బౌలింగ్ చేసి కీలక సమయంలో వరుసగా వికెట్లు పడగొట్టారు. స్టార్క్‌ (2/55), కౌల్టర్‌ నైల్‌ (2/58), స్టోయినిస్‌ (2/54) ధాటికి బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 333 పరుగులు మాత్రమే చేయగలిగింది.