పెళ్ళాడిన ఆసీస్-కివీస్ మహిళా క్రికెటర్లు

19 April, 2019 - 11:09 AM

(న్యూవేవ్స్ డెస్క్)

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ హేలీ జెన్సెన్-ఆసీస్ మహిళ క్రికెటర్ నికోలా హన్‌‌‌కాక్‌ ప్రేమ వివాహం చేసుకున్నారు. గత వారం చివర్లోనే పెళ్ళి చేసుకున్న వీరిద్దరూ ఈ విషయాన్ని తాజాగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పెళ్లితో ఒక్కటైన వీరిద్దరికీ సహచర క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు.

కివీస్ ఆల్‌‌రౌండర్ జెన్సన్ బిగ్‌‌బాష్ లీగ్‌‌లోని తొలి రెండు సీజన్లలో ‘మెల్‌‌బోర్న్ స్టార్స్’కు ప్రాతినిధ్యం వహించింది. మూడో ఎడిషన్‌‌లో మెల్‌‌బోర్న్ రెనెగడెస్‌‌కు మారింది. ఇక.. నికోల్ హన్‌‌కాక్ ‘టీం గ్రీన్’కు ప్రాతినిధ్యం వహిస్తోంది. వీరిద్దరి మధ్య చిగురించిన స్నేహం క్రమంగా ప్రేమగా మారి చివరికి పెళ్లి బంధం ద్వారా ఒక్కటవడానికి దారితీసింది. స్వలింగ సంపర్క వివాహాలు న్యూజిలాండ్‌లో చట్టబద్ధం. దీంతో హేలీ జెన్సెస్, నికోలా హన్‌కాక్ పెళ్లికి ఎలాంటి ఆటంకాలూ ఎదురవలేదు.గత సంవత్సరం దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ డేన్ వ్యాన్ నీకెర్క్.. తన సహచరి అయిన మారిజానే కేప్‌‌ను పెళ్ళి చేసుకుంది. అంతర్జాతీయ మహిళా క్రికెట్‌‌లో ఒకే జట్టుకు చెందిన ఇద్దరు మహిళా క్రికెటర్లు దంపతులుగా మారిన తొలి జంటగా అమీ శాటెర్త్‌‌వైట్-లీ తహహు గుర్తింపు పొందగా, రెండో జంటగా వ్యాన్ నీకెర్క్-కేప్‌ రికార్డులకు ఎక్కారు.