అగ్గిపుల్లల ఫ్యాక్టరీలో ఫైర్: 30 మంది బలి

21 June, 2019 - 9:41 PM

(న్యూవేవ్స్ డెస్క్)

జకార్తా: ఇండోనేషియాలో దీవుల్లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర సుమత్రా ప్రావిన్స్‌లోని బింజాయ్ నగరంలో ఉన్న ఓ అగ్గిపుల్లల ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 30 మంది మరణించారని భయపడుతున్నారు. పదుల సంఖ్యలో కార్మికులు గాయపడ్డారు. ప్రమాద తీవ్రత భారీగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. చనిపోయినవారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉండడం అందరినీ కలచివేసింది. అగ్గిపుల్లల కర్మాగారంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో కార్మికులు ప్రాణాలతో తప్పించుకునే వీలు లేకపోయిందని చెబుతున్నారు.సమాచారం అందుకున్న తక్షణమే సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్చల్లో నిమగ్నమయ్యారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటామని అధికారులు తెలిపారు. ఇండోనేషియా దీవుల్లో అనేక కర్మాగారాలున్నా, వాటిలో భద్రతాపరమైన చర్యలు అంతంతమాత్రమే అనే విమర్శలున్నాయి. దీంతో ఇక్కడ అగ్నిప్రమాదాలు కొత్తేమీ కాదు. 2017లో జకార్తా సమీపంలోని తంగెరాంగ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 47 మంది సజీవదహనం అయ్యారు. మ‌రో 43 మంది తీవ్రంగా గాయ‌ప‌డిన విషయం గుర్తుండే ఉంటుంది.