‘యాత్ర’ కొనసాగింపు…

12 August, 2019 - 8:22 PM

(న్యూవేవ్స్ డెస్క్)

బీజింగ్: కైలాస్ మానస సరోవర్ యాత్ర కొనసాగించాలని చైనా నిర్ణయించింది. ఈ నిర్ణయంపై భారత్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా చైనా ప్రభుత్వానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్వయంగా కృతజ్ఞతలు తెలిపారు. విదేశాంగ మంత్రి జైశంకర్ మూడు రోజుల పాటు చైనాలో పర్యటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ అధ్యక్షతన ఉన్నతాస్థాయి ప్రతినిధి బృందం ద్వైపాక్షిక చర్చలు జరిపుతోంది. ఈ సందర్భంగా చైనా, భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఆ క్రమంలో భారత్, చైనా సాంస్కృతిక, ప్రజా సంబంధాల మెరుగుదలపై చర్చించడంతోపాటు ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలని నిర్ణయించాయి.

రెండు దేశాల మధ్య మానవతా విలువలు పెరిగేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించాయి. టిబెట్‌పై ఉన్న ఉమ్మడి సంబంధాలు ఇకపైనా కొనసాగించాలని కూడా నిర్ణయించాయి. ఆరోగ్య సౌకర్యాల పెంపునకు ఓ బృందం ఏర్పాటు చేయాలని భారత్‌కి ఈ సందర్భంగా చైనా సూచించింది. అలాగే ఇండో – చైనా సంబంధాల్లో భారత యువతకు ఎక్కువ స్థానం కల్పించాలని కూడా నిర్ణయించాయి.

ఈ మేరకు భారత్, చైనా దేశాలు అనేక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అదేవిధంగా ఇరుదేశాల సత్సంబంధాలకు మీడియా కీలక పాత్ర పోషిస్తుందని భారత్, చైనా ఆశాభావం వ్యక్తం చేశాయి. సానుకూల సంబంధాలకు ఇకపై మీడియా సహకారం ఉండాలని ఇరు దేశాలు భావించాయి. 70 ఏళ్ల అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలన్న చైనా, భారత్ నిర్ణయించాయి.