ముందు ఎమ్మెల్యే ఆ తర్వాతే..

12 August, 2019 - 6:52 PM

(న్యూవేవ్స్ డెస్క్)

శ్రీకాకుళం : తాను మొదట ఎమ్మెల్యే అని ఆ తర్వాతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌ని అని తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. ఈ విషయం తెలుసుకోవాలంటూ తనపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ నేతలకు సీతారాం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. స్పీకర్ పదవిలో ఉండి సమీక్షాలు ఎలా నిర్వహిస్తారంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై స్పీకర్ తమ్మినేని సీతారాం నిప్పులు చెరిగారు.

తనకు ఓటు వేసి గెలిపించిన తన నియోజకవర్గ ప్రజలకు సమస్యలు వస్తే ఎవరు పరిష్కరిస్తారని టీడీపీ నేతలను ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం సూటిగా ప్రశ్నించారు. జవాబుదారిగా పని చేయాల్సిన బాధ్యత తనకు రాజ్యాంగమే కల్పించిందని తమ్మినేని సీతారాం ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్పీకర్‌గా సమీక్షలు చేయవద్దని ఏ రాజ్యాంగంలో పేర్కొందో చెప్పాలంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్న టీడీపీ నేతలకు స్పీకర్ తమ్మినేని సూచించారు.

సీఎంగా ఉన్న వ్యక్తికి దమ్ముండాలన్నారు. సామాజిక న్యాయంతో చట్టాలు చేసిన జగన్‌కి దమ్ముందని ఆయన స్పష్టం చేశారు. వాలంటీర్ల ఎంపికపై టీడీపీ వాళ్లు పిటిషన్లు వేసినా బయపడవద్దు అని ఆయన సూచించారు. ఆగస్టు 18 తర్వాత గ్రామాల్లో శాసన సభ్యులు పర్యటిస్తారని చెప్పారు. అలాగే గ్రామ వాలంటీర్ల పని తీరును వారు పరిశీలిస్తారని చెప్పారు. సోమవారం అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం … తన నియోజకవర్గమైన ఆముదాలవలసలో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు స్పీకర్ సీతారాం సమాధాన మిచ్చారు.