అధికార లాంఛనాలతో జైట్లీ అంత్యక్రియలు

25 August, 2019 - 5:03 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: తీవ్ర అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ఆదివారంనాడు పూర్తి అధికార లాంఛనాలతో ముగిశాయి. ఢిల్లీలోని యమునా నది ఒడ్డున ఉన్న నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు, ప్రముఖుల సమక్షంలో జైట్లీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తండ్రి జైట్లీ చితికి కుమారుడు రోహన్‌ నిప్పంటించారు.

అంతకు ముందు అరుణ్‌ జైట్లీ పార్ధివదేహానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, హోంమంత్రి అమిత్ షా, మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, వివిధ పార్టీల నేతలు, అభిమానులు నివాళులు అర్పించారు.దివంగత నేత జైట్లీ భౌతికకాయాన్ని  స్వగృహం నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా, ఇతర నాయకులు, శ్రేణులు జైట్లీ భౌతికకాయానికి నివాళులర్పించారు.  మరోవైపు విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ జైట్లీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. జైట్లీ భార్య, కుమారుడితో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలిపారు.  66 ఏళ్ల అరుణ్‌ జైట్లీ అనారోగ్యంతో  ఈ నెల 9 నుంచి ఎయిమ్స్‌లో చికిత్స పొందారు. జైట్లీ గత కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల సమస్య, అరుదైన కేన్సర్‌తో ఆయన బాధపడ్డారు.