మళ్లీ దూసుకొస్తున్న జేజమ్మ

14 January, 2019 - 6:55 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అనుష్క మళ్లీ వెండి తెరపై తన నటనా కౌశలాన్ని ప్రదర్శించేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. అందుకు మంచి హర్రర్ థ్రిల్లర్ చిత్రంలో నటించనుంది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు మాధవన్ కూడా నటిస్తున్నారు. అలాగే అంజలితోపాటు అర్జున్ రెడ్డి ఫేం శాలిని పాండే కూడా నటిస్తున్నారు.

అయితే ఈ చిత్రంలో వీరిద్దరిది అత్యంత ముఖ్య పాత్ర అని తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఈ ఏడాది మార్చిలో అదీ కూడా అమెరికాలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో పాత్ర కోసం జేజమ్మ సన్న బడే ప్రయత్నంలో ఉందని తెలుస్తోంది. తాజాగా రాజస్థాన్‌తో ఎస్ ఎస్ రాజమౌళి కుమారుడు కార్తీకేయ వివాహ వేడుకల్లో అనుష్క పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

శాలిని పాండే ఇప్పటికే గోరిల్లా, అగ్ని సిరగుగల్ చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. అదే విధంగా అంజలీ కూడా సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, బలుపు, మసాల, గీతాంజలి, డిక్టేటర్ తదితర చిత్రాల్లో నటించింది. అంజలి నటించిన ఆఖరి చిత్రం చిత్రంగద. గతంలో అనుష్క, మాధవన్ కలసి నటించిన చిత్రం రెండు. ఈ చిత్రం 2006లో విడుదలైన విషయం విదితమే.