ఏపీ విప్ నోట బూతు పురాణం!

09 January, 2018 - 7:36 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ఏలూరు: టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ విప్ చింతమనేని ప్రభాకర్ రూటే సెపరేటు! దుందుడుకుగా డాషింగ్ స్టైల్‌‌తో దూసుకుపోయే ఆయన ఇప్పటికే పలుమార్లు మీడియా వార్తల్లో నిలిచారు. దుందుడుకు చర్యలతో నిరంతరమూ వివాదాలతో ఉండడం ఆయనకు మామాలూ. తాజాగా మరోసారి అధికారులను దుర్భాషలాడుతూ చిందులు తొక్కారు. జన్మభూమి కార్యక్రమంలో బాహాటంగానే అధికారులను ఉద్దేశించి బూతులు వల్లించారు. చింతమనేని బూతుల వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని విజయరాయిలో జన్మభూమి కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

జన్మభూమి కార్యక్రమంలో విప్‌ చింతమనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైక్‌ సరిగ్గా పనిచేయకపోవడంతో చింతమనేని తీవ్ర అసహనానికి లోనయ్యారు. కార్డ్‌లెస్ మైక్ ఎందుకు ఇవ్వలేదంటూ చిందులు తొక్కారు. గ్రామాధికారి నరసింహారావు సంబంధిత వ్యక్తికి ఫోన్ చేసి, రప్పిస్తానని చెప్పగానే చింతమనేని ఆగ్రహంతో ఊగిపోయారు. అది జనం అందరూ పాల్గొన్న బహిరంగ కార్యక్రమం అనే విషయాన్ని కూడా మరిచిపోయారు. ఇష్టం వచ్చినట్టుగా ‘నీ …. మొగుడికి ఫోన్‌ చేస్తావా?’ అంటూ బూతులు తిట్టారు. చింతమనేని తనదైన శైలిలో దుర్భాషలు ఆడటంతో నివ్వెరపోవడం జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న వారి వంతయింది.