నానిని ఎందుకు అరెస్ట్ చేయలేదు?

03 December, 2019 - 4:34 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్, ఆయన మంత్రులు అమరావతిపై అవాస్తవాలు మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కె.అచ్చెన్నాయుడు ఆరోపించారు. అమరావతిలో ప్రస్తుతం ఉన్న వాస్తవ పరిస్థితిని రాష్ట్ర ప్రజలతోపాటు దేశ ప్రజలకు తెలియ జెప్పేందుకు తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటించారని కె.అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. మంగళవారం విజయవాడలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో టీడీపీ ప్రతినిధి బృందం భేటీ అయి.. చంద్రబాబు అమరావతి పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయిపై జరిగిన దాడి అంశంపై గవర్నర్‌కి ఫిర్యాదు చేశారు.

అనంతరం కె.అచ్చెన్నాయుడు విలేకర్లతో మాట్లాడుతూ…. గవర్నర్ వాస్తవాలు గ్రహించి తమ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. పోలీసులకు ఆదేశాలు ఇస్తానని గవర్నర్ స్పష్టం చేశారని అచ్చెన్నాయుడు తెలిపారు. పోలీసుల కుట్రతోనే చంద్రబాబుపై దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. బయట నుంచి తీసుకొచ్చి.. వైయస్ఆర్ సీపీ దాడి చేయించిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. మహిళ పద్మజను అరెస్ట్ చేయడం దారుణమని అచ్చెన్నాయుడు ఆరోపించారు. బాధ చెప్పుకున్న మహిళను అరెస్ట్ చేయడం సరైన చర్య కాదని ఆయన పేర్కొన్నారు. మరి అసభ్య పదజాలం వాడిన మంత్రి కొడాలి నానిని ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ వైయస్ జగన్ ప్రభుత్వాన్ని అచ్చెన్నాయుడు ఈ సందర్బంగా నిలదీశారు. చంద్రబాబు వాడిన బస్సును సీజ్ చేశారని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. బస్సు డ్రైవర్, కండెక్టర్‌ను అదుపులోకి తీసుకుని ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కక్ష సాధింపే లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.