‘రక్షణ కల్పించండి’

18 March, 2020 - 7:44 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తనకు రక్షణ కల్పించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బుధవారం ఐదు పేజీల లేఖ రాశారు. ఎన్నికల వాయిదాపై సీఎం జగన్ నుంచి కింది స్థాయి వరకు ప్రతి ఒక్కరు ప్రెస్ మీట్ పెట్టి.. తనను టార్గెట్ చేశారని.. చివరికి స్పీకర్‌ కూడా తనను తిట్టారని ఆ లేఖలో రమేశ్ కుమార్ పేర్కొన్నారు. తనకు, తన కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకు వెళ్లారు.

అయితే సుప్రీంకోర్టు సైతం తన నిర్ణయాలను సమర్థించిందని ఈ సందర్భంగా లేఖలో రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తనకు, తన కటుంబ సభ్యులకు ప్రాణ హాని ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో కేంద్ర బలగాలతో తనకు రక్షణ కల్పించాలన్నారు. అలాగే కేంద్ర బలగాల ఆధ్వర్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.

అదేవిధంగా కొన్ని జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న అభ్యర్థుల ఏకగ్రీవంపై కూడా సదరు లేఖలో రమేశ్ కుమార్ ప్రస్తావించారు. రాష్ట్ర విభజనకు ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవం అయిన అభ్యర్థుల సంఖ్య.. తాజా ఎన్నికల్లో ఏకగ్రీవం అయిన అభ్యర్థుల సంఖ్యను సైతం సదరు లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం.

ఇక మంత్రులకు, ఎమ్మెల్యేలకు, స్థానిక నాయకులకు సీఎం జగన్ టార్గెట్ పెట్టడంతో ఈ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులను బెదిరించడమే కాక… వారిపై  దాడులకు పాల్పడుతున్నారన్నారు. అందువల్లే అభ్యర్థుల ఏకగ్రీవం జరిగిందని చెప్పారు.

కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు మార్చి 15వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రకటించారు. అలాగే పలువురు అధికారులను బదిలీ చేయాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఆ వెంటనే సీఎం జగన్.. ప్రెస్ మీట్ పెట్టి రమేశ్ కుమార్ ప్రకటనను తప్పు పట్టారు. అంతేకాదు.. అధికార పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి సైతం రమేశ్ కుమార్‌పై నిప్పులు చెరిగారు. సీఎం జగన్.. గవర్నర్‌ను కలిసి.. రమేశ్ కుమార్ వ్యవహారంపై ఆరోపణలు గుప్పించారు. దాంతో గవర్నర్‌ను కలిసి.. రమేశ్ కుమార్ ఆధారాలతో సహా ఎందుకు ఎన్నికలు వాయిదా వేయాల్సి వచ్చిందో వివరించారు.

అయితే ఎన్నికల వాయిదాపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశాన్ని బుధవారం సుప్రీంకోర్టులో జస్టిస్ బాడ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారించి..  ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఎన్నికల సంఘం పరిధిలోని అంశమని పేర్కొంది. అయితే ఎన్నికల కోడ్ రద్దు చేయాలని పేర్కొంది. అలాగే కొత్త పథకాలకు శ్రీకారం చుట్టుకుండా.. పాత పథకాలనే అమలు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ను ఎత్తివేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కొద్ది సేపటికే కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ లేఖ రాయడం గమనార్హం.