రివర్స్ ఎన్నికలు కోరుకుంటున్న జనం!

10 September, 2019 - 10:57 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ప్రాజెక్టుల రివర్స్ టెండరింగ్ బదులు రివర్స్ ఎన్నికల్ని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారంటూ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సెటైర్ వేశారు. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని నిర్మించాలని తాము శ్రీకారం చుడితే.. జగన్ ప్రభుత్వం పురిట్లోనే చంపేసిందని ఆయన దుయ్యబట్టారు. అవినీతిలో కూరుకుపోయి ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే వ్యక్తి తనపై ఆరోపణలు చేయడం ఏంటంటూ సీఎం వైఎస్ జగన్‌పై నిప్పులు చెరిగారు. అమరావతిలో సోమవారం జరిగిన టీడీపీ న్యాయ విభాగం ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ పార్టీకి టీడీపీ న్యాయవిభాగం వెన్నుదన్నుగా నిలిచిందని, ఆనాటి ప్రభుత్వం అరాచకాలపై పోరాటం చేసిందని గుర్తుచేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అంతకు మించిన అరాచకాలు జరుగుతున్నాయంటూ జగన్ సర్కార్‌పై చంద్రబాబు ఫైరయ్యారు. రివర్స్ ఎన్నికలు మాత్రం రావు కానీ.. మూడేళ్ళలో దేశంలో జమిలి ఎన్నికలు రావచ్చని అభిప్రాయపడ్డారు.తనపై గతంలో 26 కేసులు వేసినా ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారని చంద్రబాబు ప్రస్తావించారు. తాను చేసిన అవినీతి ఏంటో వారికి ఇంకా దొరకలేదా? అంటూ అధికారులు, మంత్రులను జగన్ గణం దూషిస్తోందని ఆరోపించారు. ఎన్ని అవమానాలు చేసినా.. ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం సహిస్తానన్నారు. టీడీపీ  కార్యకర్తలు, నేతలపై రాష్ట్ర వ్యాప్తంగా 565 కేసులు బనాయించారని చంద్రబాబు గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వాన్ని నేర ప్రభుత్వంగా ప్రజల్లో నిలబెట్టే వరకూ వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. తాను చేసే ధర్మ పోరాటానికి న్యాయవాదులు మద్దతు ఇవ్వాలని చంద్రబాబు కోరారు.