ఏపీ కొత్త డీజీపీగా గౌతం సవాంగ్?!

26 May, 2019 - 7:18 AM

(న్యూవేవ్స్ డెస్క్)

విజయవాడ: ఏపీ కొత్త పోలీసు డైరెక్టర్ జనరల్‌గా గౌతమ్‌ సవాంగ్‌ నియమితులు కానున్నారు. 1986 బ్యాచ్‌కు చెందిన ఈ ఐపీఎస్‌ అధికారి సవాంగ్‌ 1963 జూలై 10న జన్మించారు. ప్రస్తుతం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె ఏఎస్పీగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని సవాంగ్ ప్రారంభించారు. చిత్తూరు, వరంగల్‌ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. 2001-2003 మధ్య వరంగల్‌ రేంజ్ డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతకు ముందు హోంగార్డు విభాగం డీఐజీగా కూడా సేవలందించారు.  2003-2004 వరకూ ఎస్‌ఐబీ డీఐజీగా, 2004-2005 మధ్య ఏపీఎస్పీ పటాలం డీఐజీగా పనిచేసిన సవాంగ్‌ ఆ తర్వాత కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లారు.

2005-2008 వరకూ సీఆర్‌పీఎఫ్‌ డీఐజీగా సవాంగ్ పనిచేశారు. 2008-2009 మధ్య శాంతిభద్రతల విభాగం ఐజీగా పనిచేసిన ఆయన ఆ తర్వాత డిప్యుటేషన్‌పై మూడేళ్లు లైబీరియాలో ఐక్యరాజ్య సమితి పోలీసు కమిషనర్‌గా ఉన్నారు. ఆ తర్వాత ఏపీ పోలీసు పటాలం అదనపు డీజీగా పనిచేశారు. 2015-2018 మధ్య విజయవాడ పోలీసు కమిషనర్‌గా పనిచేసిన సవాంగ్ తనదైన ముద్రవేసిన వేశారు. గత ఏడాది జూలై నుంచి విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా కొనసాగుతున్నారు.

కాగా.. ప్రస్తుత డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను తప్పించి వైఎస్ జగన్‌ నేతృత్వంలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం గౌతమ్‌ సవాంగ్‌ను నియమించనుంది. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి.