కొవ్వెక్కి.. పిచ్చెక్కి జగన్ పాదయాత్ర

13 May, 2018 - 11:18 AM

(న్యూవేవ్స్ డెస్క్)

విజయవాడ: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు నిరసన ఎదురైతే వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఉలిక్కిపడుతున్నారని ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఎద్దేవా చేశారు. తిరుపతి వచ్చిన అమిత్ షాపై చంద్రబాబు రాళ్లదాడి చేయించారని, కానీ అది తన పనేనని చెప్పుకునే ధైర్యం మాత్రం ఆయనకు లేదని జగన్ కృష్ణా జిల్లా కైకలూరు బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. చంద్రబాబు అంతా పథకం ప్రకారమే చేశారని, పైగా ఆ దాడిని ఖండిస్తున్నట్లు మాట్లాడుతున్నారని జగన్ ఆరోపించారు. దీనిపై విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

పట్టిసీమపై సమాధానం చెప్పకుండా జగన్ తప్పించుకుంటున్నారని దేవినేని ఉమా విమర్శించారు. ఒళ్లు కొవ్వెక్కి, సీఎం పదవి పిచ్చిపట్టి, మదంతో జగన్‌ పాదయాత్ర చేస్తున్నారని ఉమా ఎద్దేవా చేశారు. చిట్టినగర్ సందులో జగన్ ఇష్టానుసారంగా మాట్లాడారని, బాంబులు పెట్టి కొల్లేరును ధ్వంసం చేసిన చరిత్ర వైఎస్‌‌దని దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విమర్శించారు.

బెంజ్ సర్కిల్‌‌లో ఫ్లైఓవర్ పిల్లర్ పనులు పూర్తయిన తర్వాత కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని మళ్లీ పునఃప్రతిష్ఠిస్తామని మంత్రి దేవినేని ఉమ స్సష్టం చేశారు. బెంజ్ సర్కిల్‌‌కి కాకాని వెంకటరత్నం పేరు పెడతామన్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో బోటు ప్రమాదంపై ముగ్గురు సభ్యుల కమిటీ వేశామని, నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి దేవినేని పేర్కొన్నారు.