‘పోటీ పడాలనడం సరికాదు’

15 August, 2019 - 5:26 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: లైసెన్డ్స్ సర్వేయర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు వారి కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాల్సిన బాధ్యత వైయస్ జగన్ ప్రభుత్వానిదే అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. లైసెన్డ్స్ సర్వేయర్లు ఇప్పుడు బీటెక్, ఎంటెక్ చదువుకున్నవారితో పోటీ పడాలనడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. వీరికి వృత్తిపరమైన అనుభవం ఉందన్నారు.

ఈ విషయాన్ని పరిగణించాలని వైయస్ జగన్ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ సూచించారు. లైసెన్డ్స్ సర్వేయర్లు ఎవరూ ధైర్యం కోల్పోకుండా ఉండాలని .. మీకు జనసేన పార్టీ అండగా ఉంటుందని వారికి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.

తగిన విద్యార్హతలతోపాటు సర్వే విభాగంలో క్షేత్ర స్థాయి అనుభవం ఉన్న లైసెన్స్డ్ సర్వేయర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని వైయస్ జగన్ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ, రైతాంగం అవసరాలకు అనుగుణంగా పని చేస్తున్న లైసెన్స్డ్‌ సర్వేయర్ల సేవలను క్రమబద్దీకరిస్తానని పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సీఎం వైయస్ జగన్‌కి పవన్ కళ్యాణ్ సూచించారు.

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ని లైసెన్స్డ్ సర్వేయర్ల సంఘం ప్రతినిధులు కలసి తమ సమస్యలను చెప్పుకుని.. విజ్ఞపన పత్రాన్ని అందజేశారు. ఈ సంఘం ప్రతినిధి డి.వి. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ… ఏళ్ల తరబడి జీతభత్యాలు లేకుండా తహశీల్దార్ కార్యాలయాల్లో తాము విధులు నిర్వర్తిస్తున్నామన్నారు.

తమ ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తామని పాదయాత్ర సందర్భంగా వైయస్ జగన్ హామీ ఇచ్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో తమకు అవకాశం ఇస్తారని తామంతా ఆశించామని తెలిపారు. అంతేకాదు.. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి కూడా గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో అవకాశం ఇస్తామన్నారని ఆయన గుర్తు చేశారు. ఆ ఉద్యోగ నియామకాల్లో సైతం తమ ఊసే లేదని భాస్కరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.