అవగాహన కోసం ‘ప్రచార రథం’

14 February, 2020 - 3:42 PM

 

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అయితే కొన్నిశక్తులు దీనికి అడ్డుపడుతున్నాయంటూ చంద్రబాబును ఉద్దేశించి పరోక్షంగా ఆరోపించారు. వికేంద్రీకరణ మన రాష్ట్రానికి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. మూడు రాజధానుల ప్రకటనను అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.

శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలో మూడు రాజధానులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రచార రథాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… విపక్ష నేత చంద్రబాబు పీఎస్ వద్ద ఐటీ దాడుల్లో రూ. 2 వేల కోట్లు దొరికాయని ఆయన గుర్తు చేశారు. ఈ దాడుల్లో చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిని పట్టుకుంటేనే రూ. 2 వేల కోట్లు బయటపడ్డాయంటే .. చంద్రబాబును విచారిస్తే రూ. లక్షల కోట్లు బయటపడతాయన్నారు. లక్షల కోట్లు అడ్డంగా సంపాదించారన్నది అక్షరాలా నిజం కాదా? ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. బాబు అవినీతిపై విచారణ చేస్తే రూ. 2 లక్షల కోట్ల వరకు బయటకొస్తాయని ఆయన తెలిపారు.