ఏపీ మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం

12 January, 2018 - 9:42 AM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ఏపీ మంత్రులు వాహనాలు తరచు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవలే డిప్యూటీ సీఎం చినరాజప్ప, ఐటీ మంత్రి నారా లోకేష్‌ల వాహనాలు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ ఎక్సైజ్ శాఖా మంత్రి కేఎస్ జవహర్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దూబచర్ల సమీపంలో గురువారం రాత్రి ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. మద్యం మత్తులో కారు నడుపుతున్న వ్యక్తులు మంత్రి కారును ఢీకొట్టారు. ఈ ఘటనలో మంత్రి స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పెను ప్రమాదం తప్పడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. నిందితులు మరో కారును కూడా ఢీకొట్టినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.