అమరావతి నిర్మాణంపై బ్లూప్రింట్ ఇవ్వండి

22 September, 2018 - 5:39 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విజయవాడ: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం బ్లూప్రింట్‌ విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోతే మళ్లీ 10.32 శాతం వడ్డీకి బాండ్లు విడుదల చేసి మరింత అప్పులపాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ రాష్ట్రమైనా ఇలా చేసిందా అని ప్రశ్నించారు.

కంపెనీల కోసం బాండ్లు విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారాన్ని మోపుతోందని ఆరోపించారు. రాష్ట్ర విభజన నాటికి 94 వేల కోట్ల అప్పు ఉంటే.. ఇప్పుడది లక్షల కోట్లకు చేరువైందని విమర్శించారు. రాజధాని నిర్మాణంపై వెంటనే అఖిలపక్షం నిర్వహించి చర్చించాలని డిమాండ్‌ చేశారు. రాజధాని నిర్మాణం, అమరావతి బాండ్ల వ్యవహారంపై అన్ని పార్టీలతో చర్చించి ఉద్యమిస్తామని పేర్కొన్నారు.

బీజేపీతో చేతులు కలిపి… చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని రామకృష్ణ విమర్శించారు. చెంబుడు నీళ్లు, మట్టి తీసుకొచ్చినప్పుడే చంద్రబాబు నరేంద్ర మోదీని నిలదీసి ఉండాల్సిందన్నారు. స్వార్ధం కోసం అహో అన్న చంద్రబాబు ఇప్పుడు కేంద్రం మోసం చేసిందంటున్నారని విమర్శించారు.
చంద్రబాబు ప్రభుత్వం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసిందని రామకృష్ణ మండిపడ్డారు. ఎంపీ జేసీ దివాకర్‌‌రెడ్డి పోలీసులపై ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. హోం మంత్రిని డమ్మీని చేశారని ఎద్దేవా చేశారు.

కార్పొరేట్‌ సంస్థల నిర్వాకానికి వ్యతిరేకంగా ఉద్యమానికి పిలుపునిచ్చిన విద్యార్థి విభాగానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని రామకృష్ణ అన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితుల న్యాయం కోసం అక్టోబర్‌ 1న జిల్లా కలెక్టరేట్ల వద్ద చేపట్టే మహా ధర్నాకి మద్దతు ప్రకటిస్తున్నట్లు రామకృష్ణ తెలిపారు.