ఏకాంత సమావేశం!

12 February, 2020 - 7:20 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమావేశం ముగిసింది. నరేంద్ర మోదీ నివాసంలో దాదాపు 40 నిమిషాల పాటు వీరు సమావేశమయ్యారు. అయితే వీరి సమావేశం ఏకాంతంగానే జరిగిందని సమాచారం. ప్రధాని నివాసం ప్లస్ కార్యాలయానికి సీఎం జగన్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, నందిగామ సురేశ్ వెళ్లినా.. వారు మాత్రం కార్యాలయంలోనే ఉన్నారని తెలుస్తోంది.

అయితే ప్రధాని మోదీ, సీఎం జగన్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాల చర్చకు వచ్చాయని సమాచారం. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు అంశంలో కేంద్రం ఇప్పటి వరకు రెండో డీపీఆర్‌కు ఆమోదం తెలపలేదు.. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న అడ్డంకులను తొలగించి.. ఈ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని ప్రధాని మోదీని జగన్ కోరినట్లు సమాచారం.

అలాగే రాష్ట్రంలోని తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు.. ఆంగ్ల మాధ్యమం, అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన రాజధానుల అంశాన్ని సైతం మోదీ దృష్టికి ఈ సందర్భంగా జగన్ తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అదేవిధంగా శాసనమండలి రద్దుకు తీర్మానం చేయడం.. దాని నకలు ప్రతిని కేంద్రానికి కూడా పంపింది జగన్ ప్రభుత్వం. దానిని కేంద్ర కేబినెట్‌లో చర్చించి.. దానితోపాటు రాష్ట్రపతి ఆమోద ముద్రకు పంపాల్సి ఉంది. అయితే అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీని జగన్ కోరినట్లు తెలుస్తోంది.

ఇక వెనకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వడం, ప్రత్యేక హోదాపై ఇటీవల ప్రధానికి జగన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవశ్యకతను ఈ సందర్భంగా మోదీకి మరోసారి జగన్ వివరించినట్లు సమాచారం. ప్రత్యేక హోదా ఇస్తేనే ఏపీ అభివృద్ధి సాధ్యమని ఈ సందర్బంగా మోదీకి జగన్ మరోసారి స్పష్టం చేసినట్లు.. అలాగే వెనకబడిన ప్రాంతాలకు ఇస్తున్న నిధులను ప్రస్తుతం కేంద్ర ఆపేసింది. వాటిని మంజూరు చేయాలని.. జీఎస్టీ బకాయిలు రాష్ట్రానికి రావాల్సి ఉందని.. వాటిని వెంటనే విడుదల చేయాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే ఎస్జీఎస్టీ బకాయిలు విడుదల చేసినా.. ఐజీఎస్టీ బకాయిలు మాత్రం విడుదల కాలేదని ఈ సందర్భంగా మోదీకి జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలను సైతం మోదీకి జగన్ పూసగుచ్చినట్లు వివరించినట్లు సమాచారం.