బెంగళూరుకు చంద్రబాబు

08 November, 2018 - 3:15 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: బీజేపీయేతర శక్తులను ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు చంద్రబాబు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అందులోభాగంగా ఆయన గురువారం కర్ణాటక రాజధాని బెంగళూరు పయనమైయ్యారు. మాజీ ప్రధాని హెచ్ .డి. దేవెగౌడ, ఆయన కుమారుడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామితో చంద్రబాబు భేటీ కానున్నారు. బెంగళూరు పర్యటనలో చంద్రబాబు వెంట మంత్రులు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనందబాబుతో పాటు తెలంగాణ టీడీపీ నేతలు ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్‌ రెడ్డి ఉన్నారు.

ప్రధాని మోదీ ప్రభుత్వంపై చంద్రబాబు వివిధ సందర్భాల్లో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా వచ్చే పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్లేందుకు చంద్రబాబు ఇప్పటికే రెండు సార్లు హస్తినకు వెళ్లారు.

చంద్రబాబు హస్తిన పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ నేత శ‌ర‌ద్‌ప‌వార్‌, లోక్‌తంత్రిక్ జనతాదళ్ అధినేత శ‌ర‌ద్ యాద‌వ్‌, ఎస్పీ నాయకులు ములాయం సింగ్‌యాదవ్‌, అఖిలేశ్‌ యాదవ్‌, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ సీఎం ఫ‌రూఖ్ అబ్దుల్లా, సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరితో వరుస భేటీలు నిర్వహించి.. వారందరిని ఒకే వేదికపైకి తీసుకు వచ్చేందుకు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.