ఫ్యాన్ పార్టీ… ఫేక్ పార్టీ!

16 April, 2018 - 3:18 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: రాష్ట్ర ప్రయోజనాలే మన లక్ష్యం కావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో బంద్ వల్ల మనమే నష్టపోతామన్నారు. ఏదైనా చేస్తే… కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి తెలిసేలా చేయాలన్నారు. అంతేకాని బంద్ వల్ల మనమే.. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రోజు రాష్ట్ర బంద్ కారణంగా ఆర్టీసీకి మొత్తం 12 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆయన విచారం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని తన కేబినెట్ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు చంద్రబాబు సూచించారు. ముఖ్యమంత్రి నివాసంలో సోమవారం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ భేటీ జరిగింది.

ఏప్రిల్ 20వ తేదీ చంద్రబాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన ఓ రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయన భేటీలో నాయకులతో చర్చించారు. ఆ రోజు నియోజకవర్గాల్లో నిర్వహించే దీక్షల్లో ఎమ్మెల్యేలు, ఇంచార్జ్‌లు పాల్గొన్నాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ నెల 30న తిరుపతిలో నిర్వహించే దళిత తేజం సభపై కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది.

ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్‌‌పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఆ పార్టీనే ఫేక్ పార్టీ అని ఆయన మండిపడ్డారు. ఫేక్ ఫొటోలు, ఫేక్ వీడియోలు, ఫేక్ ప్రచారం, ఇంకా చెప్పాలంటే వైఎస్ఆర్‌సీపీ నేతల ప్రచారమే ఫేక్ అని చంద్రబాబు మండిపడ్డారు. ఇది ఎన్నికల ఏడాది.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సమావేశంలో పాల్గొన్న ఓ ప్రతి ఒక్కరికీ చంద్రబాబు సూచించడం గమనార్హం.