షాపై రాళ్లదాడి ఘటనపై బాబు ఆగ్రహం

11 May, 2018 - 3:47 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కాన్వాయ్‌‌పై తిరుమలలోని అలిపిరి వద్ద జరిగిన రాళ్లదాడి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని పార్టీ శ్రేణులను ఆదేశించారు. పార్టీ క్రమశిక్షణకు బద్ధులై అందరూ వ్యవహరించాలని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలిసీ తెలియని ప్రవర్తనతో పార్టీకి చెడ్డపేరు తీసుకురావద్దని, ఏ సమయానికి ఎలా స్పందిచాలనేది అందరూ తెలుసుకోవాలని మందలించారు. అధికారంలో ఉన్నప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకూ ధర్మపోరాటం కొనసాగుతుందని, కేంద్రం సహకారం లేకపోయినా ఏపీ అభివృద్ధి ఆగదని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటక ఎన్నికల తర్వాత టీడీపీ సంగతి చూస్తామని బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని.. అయితే.. తమ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని చంద్రబాబు చెప్పారు. న్యాయం కోసం సీఎంగా ప్రధానిపై పోరాటం చేస్తున్నానని పేర్కొన్నారు.

కాగా.. అమిత్‌‌షా కాన్వాయ్‌‌పై రాళ్లదాడి ఘటన దురదృష్టకరమని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. బీజేపీ నేతలే రెచ్చగొడుతున్నారని చెప్పారు. అసలు అమిత్‌‌షా వాహనంపై రాళ్ళే పడలేదని, వెనక ఉన్న వాహనాలపై రాళ్లు పడ్డాయని హోంమంత్రి చినరాజప్ప తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించడం గమనార్హం.