‘మోదీకి పాలించే అర్హత లేదు’

11 February, 2019 - 10:58 AM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీకి మన దేశాన్ని పాలించే అర్హత లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్‌‌ను ఆదుకుంటామని, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన మోదీ మోసం చేశారని ఢిల్లీ వేదికగా చంద్రబాబు కేంద్రంపై ధ్వజమెత్తారు. ఏపీకి కేంద్ర చేసిన అన్యాయంపై తాము పోరాటం చేస్తున్నామని, భిక్ష కోసం కాదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు చేయాలంటూ చంద్రబాబు సోమవారం ఢిల్లీలోని ఏపీ భవన్‌ వేదికగా ధర్మపోరాట దీక్ష చేస్తున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ ఈ దీక్ష కొనసాగుతుంది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మూడు రోజుల సమయం ఇస్తున్నా.. పార్లమెంట్‌ వేదికగా ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఏపీ ప్రజలు మిమ్మల్ని క్షమించరు’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఒక రాష్ట్రం పట్ల వివక్ష చూపినప్పుడు న్యాయం కోసం పోరాడాల్సిందే. పరిపాలించే వ్యక్తులు ధర్మాన్ని పాటించనప్పుడు మనం పోరాడాల్సిందే. పార్లమెంట్‌ సాక్షిగా ఏపీకిచ్చిన హామీలు పరిష్కరించలేదు. దీనిపై నిలదీయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. విభజన సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదు. విభజనతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆనాడు బీజేపీ నేతలే చెప్పారు. ఇచ్చిన నిధులు కూడా వెనక్కి తీసుకున్నారు. పోలవరం డీపీఆర్‌‌ను ఆమోదించలేదు. విశాఖ రైల్వేజోన్‌, కడప ఉక్కు పరిశ్రమపై అతీగతీ లేదు. రెవెన్యూ లోటు తీర్చలేదు. రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వలేదు’ అని దుయ్యబట్టారు.

కేంద్రానికి గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని చంద్రబాబు హెచ్చరించారు. కొన్ని పార్టీల్ని పట్టుకుంటే గెలవచ్చని మోదీ అనుకుంటున్నారని, తెలుగువారి సత్తా, ప్రజల నాడి తెలియని వ్యక్తి మోదీ అని విమర్శించారు. ధర్మాన్ని పాటించే వ్యక్తి మోదీ అయితే గుంటూరు వచ్చి విమర్శించరని, విభజన గాయాన్ని మరింత పెద్దగా చేసి కారం చల్లి సంతోషిస్తున్నారని, ఇది నీచం.. పరమ దుర్మార్గమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘పార్లమెంటులో క్షమాపణ చెబితే తెలుగు ప్రజలు క్షమిస్తారు.. తేదంటే శాశ్వతంగా బీజేపీని బహిష్కరిస్తారు. ఏపీ చరిత్రలో బీజేపీ పూర్తిగా తుడిచుకుపెట్టుకుపోయే పరిస్థితి వస్తుంది’ అని హెచ్చరించారు.

‘కేంద్రం ఆటలు సాగవని చెప్పేందుకే ఢిల్లీకి వచ్చా. ఐదు కోట్ల ప్రజల కోసం.. భావితరాల భవిష్యత్తు కోసం.. ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నాం. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే తగిన గుణపాఠం చెబుతాం. లెక్కలు చెప్పడానికి మేం సిద్ధం. మేం కట్టిన పన్నులకు మీరు లెక్కలు చెబుతారా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘గుంటూరు వచ్చిన ప్రధాని మోదీ ప్రత్యేక హోదాపై మాట్లాడలేదేం? ఏపీలో అడుగుపెట్టే హక్కు ఎవరిచ్చారని అడుగుతున్నాం?’ అంటూ చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు.