గురువుకే నామం పెట్టిన మీరా విమర్శించేది..?

10 February, 2019 - 4:07 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విజయవాడ: గురువుకే పంగనాలు పెట్టిన చరిత్ర మోదీదని ఏపీ సీఎం తూర్పారపట్టారు. అలాంటి మోదీ.. దివంగత ఎన్టీఆర్‌కు తాను వెన్నుపోటు పొడిచానని విమర్శించడం ఏంటని నిప్పులు చెరిగారు. బీజేపీ అగ్రనేత అద్వానీ నమస్కారం పెడితే ప్రతి నమస్కారం చేయని సంస్కారం మోదీదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. చేరదీసి ఆదరించిన అద్వానీకి వెన్నుపోటు పొడిచింది మోదీ కాదా అని ఆయన ప్రశ్నించారు. గోద్రా అల్లర్ల అనంతరం మోదీని తీసేయాలని వాజపేయి సిఫారసు చేసినప్పుడు అద్వానీ అడ్డుపడి మోదీని ఆదుకున్నారని, అలాంటి అద్వానీ ఎదురుపడితే నమస్కారం పెట్టే సంస్కారం కూడా మోదీకి లేదని విమర్శించారు. కేవలం తనను దూషించేందుకు మాత్రమే ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి గుంటూరు వచ్చినట్లు ఉందని చంద్రబాబు ఆరోపించారు. విజయవాడలో ఆదివారం నిర్వహించిన లక్ష నివాస స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు ఈ రోజు గుంటూరు ప్రజా చైతన్య సభలో మోదీ చేసిన వ్యాఖ్యలపై అంతే ఘాటుగా మండిపడ్డారు.

‘నన్ను దూషించేందుకే మోదీ ఢిల్లీ నుంచి గుంటూరు వచ్చారు. ఏపీకి న్యాయం చేయడం చేతకాని ప్రధాని మోదీ తిట్టేసి పారిపోయారు. ఏం చేశారో జవాబు చెప్పలేకపోయారు. ఎందుకు అన్యాయం చేశారని రాష్ట్ర ప్రజలు నిలదీస్తున్నారు. రాష్ట్ర హక్కుల కోసం ఇప్పటికే పోరాడుతూనే ఉన్నాం. కాంగ్రెస్‌ పార్టీ తల్లిని చంపి బిడ్డను కాపాడిందని మోదీ చెప్పారు. తల్లిని కూడా దగా చేసిన వ్యక్తి మోదీ. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో పెట్టారు. విభజన చట్టం హామీలు అమలు చేయాలని 29 సార్లు ఢిల్లీ వెళ్లా. రాష్ట్రానికి మట్టి, నీళ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే 15 సీట్లు అదనంగా వచ్చేవి. మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు ముస్లింలను ఊచకోత కోశారు. అప్పుడు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశా. అది మనసులో పెట్టుకుని ఆయన మాట్లాడుతున్నారు’ అని చంద్రబాబు అన్నారు.‘గో బ్యాక్’ అంటే మోదీని ఢిల్లీకి పొమ్మనో, మళ్లీ అధికారం చేపట్టమనో కాదని, ఢిల్లీ గద్దె దిగి గుజరాత్‌ పొమ్మని జనం తెగేసి చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. మోదీ కాపలాదారు కాదని, దగాకోరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ చెబుతున్నట్టు తాము పార్టీలేమీ మార్చలేదని, ఎన్టీఆర్ పేరు పెట్టిన పార్టీలోనే ప్రజాసేవ చేస్తున్నామని, ఏరోజూ తాము అవకాశవాద రాజకీయాల జోలికి పోలేదని చెప్పారు. ‘ఆయన ఛాయ్ వాలా అంటారు. లక్షలు, కోట్ల రూపాయల సూటు, బూటు వేస్తార’ని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం దురహంకారంతో తాము ఆనాడు పోట్లాడామని, ఇప్పుడు అదే స్థానంలో బీజేపీ న్యాయకత్వంలో అన్యాయం జరుగుతుంటే దేశాన్ని కాపాడేందుకు పోరాడితే తప్పేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. లోకేష్ తండ్రి చంద్రబాబు అంటూ మోదీ వ్యక్తిగత విమర్శలకు దిగడాన్ని కూడా చంద్రబాబు ఎండగట్టారు. ‘మీకు కొడుకుల్లేరు. పెళ్లాన్ని వదిలేశారు. కుటుంబం అక్కర్లేదు. అనుబంధాలు, ఆత్మీయతలు తెలియవు’ అని నిప్పులు చెరిగారు. తనది యూటర్న్‌ కాదని, రైట్‌ టర్న్‌ అని చంద్రబాబు చెప్పారు. మోదీదే యూటర్న్‌ అన్నారు.