కలెక్టర్ల వివరణ కోరిన ఏపీ సీఈఓ

17 April, 2019 - 5:23 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ఈ నెల 11న ఏపీ వ్యాప్తంగా పోలింగ్‌ రోజు జరిగిన సంఘటనలపై వివరణ ఇవ్వాలని 13 జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది కోరారు. నియోజకవర్గానికి ముగ్గురు భెల్‌ నిపుణుల్ని కేటాయించినా వారి సేవల్ని వినియోగించుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు జిల్లాల్లో రూట్‌ మ్యాప్‌‌లు కూడా సాంకేతిక నిపుణులకు ఇవ్వకపోవడాన్ని ఎన్నికల సంఘం గుర్తించింది. ఎన్నికలకు నాలుగు రోజుల ముందే రాష్ట్రానికి 600 మంది భెల్‌ ఇంజినీర్లు వచ్చినా జిల్లా కలెక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఎన్నికల సంఘం సీరియస్‌ అయింది.

ఆ రోజున సాయంత్రం ఆరు గంటల తర్వాత పోలింగ్‌ జరగడానికి కారణాలను ఆయా జిల్లాల కలెక్టర్లు రాతపూర్వకంగా వివరించాలని సీఈఓ ద్వివేది ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసినవారిపై ఎఫ్‌ఐఆర్‌‌లు నమోదు చేస్తామని హెచ్చరించారు.

కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఆర్వో ఈవీఎంలను పోలింగ్‌ ముగిసిన తర్వాత రోజు ఈవీఎంలను అప్పగించడంపై, రాజాంలో మైనర్లు ఓటు వేసిన ఘటనల్లో వెంటనే నివేదికలు పంపాలని సీఈఓ ద్వివేది ఆదేశించారు. మరికొందరు అధికారులపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ద్వివేది పేర్కొన్నారు.