14 రోజులు ఏపీ బడ్జెట్ సమావేశాలు

11 July, 2019 - 8:44 AM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ బడ్జెట్ సమావేశాలు శని, ఆదివారాలు తప్ప 14 పనిదినాల్లో కొనసాగనున్నాయి. బడ్జెట్ సమావేశాలను ఈ నెల 30వ తేదీ వరకూ నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. అసెంబ్లీ కార్యకలాపాల వ్యవహారాల సలహామండలి (బీఏసీ) సమావేశం శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ అధ్యక్షతన బుధవారం జరిగింది. స్పీకర్‌ చాంబర్‌లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి, సభా నాయకుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హాజరయ్యారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మంత్రులు కన్నబాబు, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. గురువారం ఉదయం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చే అంశాలపై బీఏసీలో ప్రధానంగా చర్చ జరిగింది.

కాగా.. గురువారం నుంచి ప్రారంభమయ్యే శాసనసభ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తొలిసారిగా శుక్రవారం సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఆ రోజు ఉదయం 11 గంటలకు 2019–20 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అసెంబ్లీకి సమర్పిస్తారు. శాసనమండలిలో సభా నాయకుడు, రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కురసాల కన్నబాబు అసెంబ్లీలో ప్రవేశపెడతారు. శాసన మండలిలో పశు సంవర్ధక, మత్య్స శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యవసాయ బడ్జెట్‌ సమర్పిస్తారు.