‘జగన్ అలా మాట్లాడే వాడు కాదు’

15 February, 2020 - 3:22 PM

(న్యూవేవ్స్ డెస్క్)

గుంటూరు: ఎన్డీఏలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరడంపై తమకు ఎలాంటి సమాచారం లేదని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. శనివారం గుంటూరులో కన్నా విలేకర్లతో మాట్లాడుతూ… టీడీపీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు సమదూరం పాటించాలన్నదే తమ పార్టీ విధానమని ఆయన పేర్కొన్నారు. అయితే రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపైనే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ అయ్యారని కన్నా తెలిపారు.

ప్రధాని, కేంద్ర మంత్రులను వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుస్తారని.. ఈ సందర్భంగా రాష్ట్ర సమస్యలను కేంద్ర దృష్టికి సీఎంలు తీసుకు వెళ్తారని కన్నా ఉదాహరించారు. అలాగే ప్రధాని, హోం మంత్రిలో జగన్ భేటీ జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. అదీకాక ఎన్డీఏలో వైయఆర్ సీపీ చేరడం అనే అంశంపై తమ పార్టీ నేతలతో ఇప్పటి వరకు  చర్చలు జరిపిన దాఖలాలు లేవన్నారు.

అయినా ప్రధాని, హోం మంత్రితో భేటీ తర్వాత ముఖ్యమంత్రి ఎవరితోనైనా మాట్లాడితే.. అసలు విషయం ఏమిటీ అనేది బయటకు తెలుస్తుందని.. కానీ జగన్ అలా మాట్లాడే వాడుకాదంటూ కన్నా సెటైర్ వేశారు. రాష్ట్రంలో పాలనకు, రాక్షస పాలనకు తేడా లేదన్నారు. అయినా మంత్రి బొత్స సత్యనారాయణ అలా ఎందుకు మాట్లాడారో తెలియడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

కడపలో మా పార్టీ నేతలపై దాడి చేసి.. మళ్లీ మాపైనే కేసులు పెట్టారని కన్నా ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక దందా అడ్డుకున్న బీజేపీ నేత సత్యనారాయణ రెడ్డిపై కేసులు సైతం పెట్టారని కన్నా గుర్తు చేశారు. కడపలో ఫిబ్రవరి 19వ తేదీన పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా, వైయస్ఆర్సీపీ అరాచకాలకు వ్యతిరేకంగా బీజేపీ ర్యాలీ నిర్వహిస్తుందని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.