‘బీజేపీ ఊరుకోదు’

29 November, 2019 - 5:26 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ : దేవాదాయ భూములను అన్యాక్రాంతం చేసేందుకు వైయస్ జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. దేవుడి భూముల జోలికి వస్తే బీజేపీ ఊరుకోదంటూ వైయస్ జగన్ ప్రభుత్వాన్ని కన్నా లక్ష్మీనారాయణ హెచ్చరించారు. అలాగే దేవాదాయ శాఖ నిధులను ఇతర మతాల వారికి ఖర్చు పెట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

శుక్రవారం న్యూఢిల్లీలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుంటోందని కన్నా వ్యంగ్యంగా అన్నారు. అయితే చంద్రబాబు పాలనకు, వైయస్ జగన్ పాలనకు తేడా లేదని కన్నా లక్ష్మీనారాయణ పునరుద్ఘాటించారు. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం కార్యకర్తలకు, కావాల్సిన వారికే ఉద్యోగాలు ఇస్తోందని ఆయన ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికులను వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇసుక పాలసీ పేరుతో కృత్రిమంగా ఇసుక కొరత సృష్టించారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వానికి మద్యం మీద ఉన్న శ్రద్ధ ఇసుక మీద లేదని కన్నా ఎద్దేవా చేశారు. అయతే ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే దూషణలతో సమస్యను పక్క దోవ పట్టిస్తున్నారంటూ వైయస్ఆర్ సీపీ నేతలపై కన్నా నిప్పులు చెరిగారు.

అంతకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలోపేతంపై ఆ పార్టీ ఎంపీ సుజనా చౌదరి నివాసంలో రాష్ట్రానికి చెందిన నేతలు కన్నా లక్ష్మీనారాయణ, టీజీ వెంకటేశ్, వై. సత్యకుమార్, సతీష్‌తోపాటు ఏపీ వ్యవహారాల సహా బాధ్యుడు సునీల్ దేవ్‌ధర్ పాల్గొన్నారు.