‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది’

20 August, 2019 - 7:25 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: అసెంబ్లీ ఫర్నిచర్‌ను ఇంటికెందుకు తీసుకెళ్లారో చెప్పాలని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కె. కన్నబాబు డిమాండ్ చేశారు. ఈ అంశంపై విచారణ జరుగుతుందని తెలిశాక ఫర్నీచర్ తీసుకెళ్లామని ఇప్పుడు చెబుతున్నారంటూ కోడెల శివ ప్రసాద్ వ్యవహరిస్తున్న తీరుపై కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో భద్రత లేని కారణంగానే ఇంటికి తీసుకెళ్లానని కోడెల చెబుతున్న సమాధానం చాలా విడ్డూరంగా ఉందన్నారు.

అసెంబ్లీలో లేని భద్రత ఆయన ఇంట్లో ఉంటుందా? ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా ? అని కన్నబాబు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసిన వ్యక్తే ఇలా చేస్తే.. ప్రజలు ఏమనుకుంటారన్నారు. అయితే కోడెల విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని మంత్రి కన్నబాబు తెలిపారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు నిండి జలకళ సంతరించుకుందని ఆయన చెప్పారు. రాయలసీమలో చాలా మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొని ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

రైతులను ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కన్నబాబు  ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కృష్ణానదికి వచ్చిన వరదలతో గోదావరి జిల్లాల్లో పంటనష్టం కలిగిందని చెప్పారు. మినుము, పెసర విత్తనాలను రైతులకు వందశాతం రాయితీతో సరఫరా చేస్తామని కన్నబాబు తెలిపారు. అలాగే రాయలసీమకు కృష్ణా నీటిని తరలించామని.. ఇవి కళ్లకు కనిపిస్తున్నా మాజీ మంత్రి దేవినేని ఉమతోపాటు ఆ పార్టీ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని కన్నబాబు మండిపడ్డారు.

చంద్రబాబు నివాసంపై డ్రోను ఎగరడం అంశాన్ని రాద్ధాంతం చేస్తున్నారంటూ టీడీపీ నేతలపై కన్నబాబు  నిప్పులు చెరిగారు. అసలు ఈ రాష్ట్రంలో డ్రోన్ కార్పోరేషన్ ఏర్పాటు చేసింది చంద్రబాబు కాదా ? అని ఈ సందర్భంగా టీడీపీ నేతలను కన్నబాబు ప్రశ్నించారు. గత పుష్కరాల్లో డ్రోను వినియోగించిన విషయాన్ని కన్నబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. వరద వలన ఎవ్వరికీ నష్టం లేకుండా చర్యలు తీసుకునేందుకే డ్రోన్ ఎగరవేయడం జరిగిందని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. ‌