నిశబ్ధంగా..

20 July, 2019 - 8:34 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: స్వీటీ అనుష్క నటిస్తున్న తాజా చిత్రం ‘నిశబ్ధం’. ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌ను శనివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఈ పోస్టర్‌లో అనుష్క చేతులను మాత్రమే చూపించారు. ఆ చేతులకు విభిన్న రంగులు వేసి.. సైగలు సూచిస్తున్నాయి.

దీనిని బట్టి అనుష్క ఈ చిత్రంలో దివ్యాంగురాలి పాత్రలో ఒదిగిపోయి నటిస్తున్నట్లు తెలుస్తోంది. అనుష్క చిత్ర సీమకు వచ్చి 14 ఏళ్లు పూర్తి అయింది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా స్వీటీకి చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలిపింది.

మంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పోరేషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్ర షూటింగ్ దాదాపు 50 శాతం మేర పూర్తయింది. అందులోభాగంగా ఈ చిత్రంలోని పలు సన్నివేశాలను యూఎస్‌లో షూట్ చేశారు.

ఈ చిత్రంలో మాదవన్,షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్, అంజలి కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగులో తెరకెకిస్తున్న ఈ చిత్రం.. హిందీ, తమిళ, మలయాళ భాషల్లోకి డబ్ చేయనున్నారు. అయితే తెలుగుతోపాటు అన్ని భాషలోను ఒకే రోజు ఈ చిత్రం విడుదలకానుంది .