‘అంతరిక్షం’ సినిమా రివ్యూ

21 December, 2018 - 4:52 PM

సినిమా: అంతరిక్షం 9000 కేఎంపీహెచ్‌
జానర్: సైన్స్‌‌ఫిక్షన్‌ స్పేస్‌ థ్రిల్లర్‌
నటీనటులు: వరుణ్‌ తేజ్‌, అదితిరావ్‌ హైదరి, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్‌, రాజా, రెహమాన్‌, శ్రీనివాస్‌ అవసరాల, రఘు.
సంగీతం: ప్రశాంత్ విహారి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంకల్ప్‌రెడ్డి
నిర్మాతలు: క్రిష్‌, రాజీవ్‌‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి, మురళి

‘కంచె’ మూవీ నుంచి వైవిధ్యభరితమైన చిత్రాల్ని ఎంచుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకొక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌. తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో ఎవ్వరూ టచ్‌ చేయని కాన్సెప్ట్‌‌ను ఎంచుకున్నాడు. ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్‌‌రెడ్డి తన రెండో ప్రయత్నంగా తొలి తెలుగు స్పేస్‌ మూవీ అంతరిక్షంను తెరకెక్కించాడు. వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన ఈ విజువల్‌ వండర్‌‌‌పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. టీజర్‌, ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉండటంతో సంకల్ప్‌ మరోసారి మ్యాజిక్‌ చేస్తాడనే నమ్మకం కలిగింది. మరి ఆ నమ్మకాన్ని సంకల్ప్‌‌రెడ్డి నిలబెట్టుకున్నాడా? వరుసగా రెండు సూపర్‌ హిట్‌‌లు అందుకున్న మెగా ప్రిన్స్ అంతరిక్షం మూవీతో హ్యాట్రిక్‌ సక్సెస్‌‌ అందుకున్నాడా? చూద్దాం.

స్టోరి:
దేవ్‌ (వరుణ్‌‌తేజ్‌) ఒక వ్యోమగామి. రష్యాలో శిక్షణ పొంది పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటాడు. అతనికి ఓ చాలెంజ్ ఎదురవుతుంది. ‘విప్రయాన్‌’ అనే శాటిలైట్‌ కక్ష్యలోకి వెళ్లాక విఫలం అవుతుంది. దాని వల్ల మిగిలిన ఉపగ్రహాలకు నష్టం వాటిల్లుతుంది. దాన్ని సరిచేయకపోతే ప్రపంచవ్యాప్తంగా కమ్యునికేషన్‌ వ్యవస్థ నాశనం అవుతుంది. ఇది భారతదేశ కీర్తి ప్రతిష్టలకు సంబంధించిన విషయంగా మారుతుంది. దానిని డీకోడ్‌ చేయడానికి దేవ్‌ అవసరం ఏర్పడుతుంది. అయితే అప్పటికే తన ఉద్యోగాన్ని వదిలేసి దేవ్‌ దూరంగా వెళ్లిపోతాడు. అసలు దేవ్‌ ఎందుకు వెళ్లిపోయాడు? ఈ విప్రయాన్‌ సవాల్‌ను దేవ్‌ స్వీకరించాడా? లేదా? అంతరిక్షంలో భారతదేశ కీర్తి పతాకాన్ని దేవ్‌ ఎలా ఎగురవేశాడు? అనేదే కథ.న‌టీన‌టులు:
మొదటి నుంచీ ప్రయోగాలు చేస్తూ వస్తున్న వరుణ్‌తేజ్‌ ప్రతీ సినిమాతో నటుడిగా ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తున్నాడు. ఈ సినిమాలో టెంపర్‌ కంట్రోల్‌ లేని సైంటిస్ట్‌‌గా, ప్రేమికుడిగా, స్పేస్‌‌లో సాహసాలు చేసే వ్యోమగామిగా అద్భుతంగా నటించాడు. దేవ్‌ పాత్రకు ప్రాణం పోశాడు. రియా పాత్రలో అదితిరావ్‌ హైదరి సూపర్బ్ అనిపించింది. ద్వితీయార్ధంలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుంది. లుక్స్‌‌తో పాటు నటన పరంగా కూడా మంచి మార్కులు కొట్టేసింది. లావణ్య త్రిపాఠిది దాదాపు అతిథి పాత్రే. ఉన్నంతలో అందంతో అభినయంతో ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో సత్యదేవ్‌, రాజా, రెహమాన్‌, అవసరాల శ్రీనివాస్‌ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

విశ్లేష‌ణ‌:
అంతరిక్షానికి సంబంధించిన కథ అనగానే హాలీవుడ్‌ చిత్రాలు గుర్తుకొస్తాయి. ఇలాంటి ప్రయత్నం తెలుగులో ఎవరూ చేయలేదు. నిజానికి మనదేశంలో ఇలాంటి సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి. ఇలాంటి కథాంశాన్ని ఎంచుకోవడం ఒక విధంగా సాహసమే. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి ఈ మూవీ దూరంగా ఉండే అవకాశమూ లేకపోలేదు. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రేమ, సెంటిమెంట్‌, సున్నితమైన దేశభక్తి.. ఇలాంటివన్నీ మేళవించి సంకల్ప్‌‌రెడ్డి ఓ కథగా రాసుకున్నారు. తొలి సగమంతా దేవ్‌ ఆశయాలు, తన ప్రేమకథ, ఈ దేశానికి వచ్చిన సమస్య వీటితోనే సాగిపోయింది.అంతరిక్షంలో దేవ్‌ చేసే సాహసాలే ఈ కథకు మూలం.సినిమా మొదట్లోనే మిహిరాకు సంబంధించిన డిటెయిల్స్‌‌తో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ దర్శకుడు క్రియేట్‌ చేశాడు. ఎక్కువ భాగం పాత్రల పరిచయంతో పాటు స్పేస్‌ మిషన్‌ అవసరం ఏంటి అనే విషయాలను వివరించేందుకు కేటాయించాడు. ఫస్ట్ హాఫ్‌లో లవ్‌ స్టోరి కూడా అంత ఆసక్తికరంగా అనిపించదు. సెకండ్‌ హాఫ్ అంతా అంతరిక్షంలోనే నడుస్తూ ఆడియన్స్‌‌ను థ్రిల్‌ చేస్తుంది. రాకెట్ ప్రయోగం ఎలా జరుగుతుంది. వ్యోమగామలు ఎలాంటి కోడ్స్‌ వాడతారు. ఎలా కమ్యూనికేట్ చేస్తారు లాంటి అంశాల్లో సంకల్ప్ చేసిన రిసెర్చ్‌ తెర మీద కనిపిస్తుంది. రెండో సగంలో కథ పెద్దగా లేకపోయినా.. తన కథనంతో ఆడియన్స్‌‌ను సంకల్ప్‌రెడ్డి కట్టిపడేశాడు.

ఈ సినిమాకు మరో ప్రధానమైన ప్లస్‌‌పాయింట్‌ సినిమాటోగ్రఫి. స్పేస్‌‌లో ఉండే పరిస్థితులను తెర మీద కళ్లకు కట్టినట్టుగా సినిమాటోగ్రాఫర్‌ జ్ఞానశేఖర్‌ చూపించాడు. గ్రాఫిక్స్‌ అద్భుతం అనేంతగా లేకపోయినా తమకున్న బడ్జెట్‌ పరిధిలో మంచి అవుట్‌‌పుట్‌ ఇచ్చారు. ప్రశాంత్ విహారి సంగీతం సినిమా స్థాయిని పెంచింది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. తెలుగు వాతావరణానికి, మన కమర్షియల్‌ సూత్రాలకు విభిన్నమైన కథను దర్శకుడు ఎంచుకున్నాడు. అయితే.. ఇలాంటి కథలు ఎంత మందికి చేరువ అవుతాయనేడి దర్శకుడు ఆలోచించుకుని ఉండాల్సింది.

బలాలు:
ప్రధాన నటుల నటన
మ్యూజిక్‌
సరికొత్త నేపథ్యం
దర్శకుడి ఆలోచన
సినిమాటోగ్రఫి
సెకండ్‌ హాఫ్‌
సాంకేతిక నిపుణుల పనితనం
బలహీనతలు:
తొలి సగంలో కొన్ని బోరింగ్‌ సన్నివేశాలు
సైన్స్‌ పదజాలం ఎక్కువగా ఉండటం
నెమ్మదిగా కథా గమనం సాగడం