దాచేపల్లిలో మరో దారుణం

12 May, 2018 - 4:31 PM

(న్యూవేవ్స్ డెస్క్)

గుంటూరు: దాచేపల్లిలో మైనర్‌ బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఘటన నుంచి ఇంకా తేరుకోక ముందే అలాంటిదే మరో దారుణం దాచేపల్లిలోనే వెలుగు చూసింది. పదమూడేళ్ల బాలికపై దాచేపల్లి మండల కో ఆప్షన్‌ సభ్యుడు మహబూబ్‌ వలీ అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటపెడితే చంపుతానంటూ చిన్నారిని బెదిరించాడు. దీంతో, భయపడిపోయిన ఆ చిన్నారి ఈ విషయం బయటపెట్టలేదు. ఎట్టకేలకు స్థానికుల సహకారంతో ఆ బాలిక పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగు చూసింది.

బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం గురజాల ఆస్పత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె మూడు నెలల గర్భవతిగా నిర్ధారించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

దాచేపల్లిలో ఇటీవల తొమ్మిదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ భారీ ఎత్తున ఆందోళనలు జరిగాయి. సీఎం ఆదేశాలతో పోలీసులు నిందితుడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా గాలించారు. అయితే.. నిందితుడు చేయకూడని నేరం చేశానంటూ పశ్చాత్తాపంతో ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.