పెట్రోల్ ధర మరో 28 పైసలు పెంపు

14 September, 2018 - 12:46 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు ఇప్పట్లో కళ్ళెం పడేలా కనిపించడం లేదు. చమురు ఉత్పత్తు రోజువారీ సవరణల్లో భాగంగా శుక్రవారం కూడా ధర మరోసారి పెరిగింది. దేశ రాజధానిలో గురువారం రూ. 81ని తాకిన పెట్రోల్‌ ధర శుక్రవారం మరో 28 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 81.28గా ఉంది.

ఇక ఇంధనం ధరలు అత్యధికంగా ఉండే ముంబైలో పెట్రోల్‌ ధర రూ.90కి మరింత చేరువైంది. శుక్రవారంనాడు ముంబైలో లీటర్ పెట్రోల్‌ ధర రూ. 88.67గా ఉంది. చెన్నైలో రూ. 84.49, కోల్‌‌కతాలో రూ. 83.14, హైదరాబాద్‌‌లో రూ. 86.18గా ఉంది.

మరోవైపు డీజిల్ ధర కూడా శుక్రవారం మరో 22 పైసలు పెరిగింది. ఢిల్లీలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.73.30గా ఉంది. ముంబైలో రూ. 77.82, కోల్‌‌కతాలో రూ. 75.15, చెన్నైలో రూ. 77.49, హైదరాబాద్‌‌లో రూ. 79.73గా ఉంది.

సెప్టెంబరు 5, సెప్టెంబరు 12 తేదీల్లో తప్ప గత కొన్ని వారాలుగా ప్రతి రోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ముడిచమురు ధరలు పెరగడంతో పాటు ఎక్సైజ్‌ సుంకం ఎక్కువగా ఉండటంతో దేశీయంగా చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆగస్టు నెల మధ్య నుంచి ఇప్పటి వరకు లీటర్‌ పెట్రోల్‌‌పై రూ. 4.48, డీజిల్‌‌పై రూ. 4.77 పెరిగింది. దీంతో వినియోగదారులపై నేరుగాను, నిత్యావసర వస్తువులపై పరోక్షంగాను మోయలేనంతగా భారం పడుతోంది.