ఏపీలో అన్న క్యాంటీన్లు ప్రారంభం

11 July, 2018 - 3:46 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విజయవాడ: క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో రాజీపడకుండా పేదలకు నాణ్యమైన ఆహారం అందిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడలోని విద్యాధరపురంలో అన్న క్యాంటీన్‌ను బుధవారంనాడు చంద్రబాబు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ‘ఎ’ కన్వెన్షన్‌ సెంటర్‌‌లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ల ప్రారంభ సభలో సీఎం మాట్లాడుతూ.. అందరూ కడుపునిండా తినాలనే సదుద్దేశంతోనే అన్న క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టిన ఎన్టీఆర్‌ పేరుతో క్యాంటీన్లు నిర్వహిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. నాణ్యమైన ఆహారాన్ని రూ. 5కే అందిస్తున్నామన్నారు. అన్న క్యాంటీన్లను చక్కగా ఉంచాల్సిన బాధ్యత ప్రజలు తీసుకోవాలని సూచించారు. పేదలు, వృద్ధులకు అన్నక్యాంటీన్లు ఒక వరమని అన్నారు. దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇస్తే.. స్వీకరిస్తామని చెప్పారు. అన్ని బిల్లులను ఆన్‌‌లైన్‌‌లో చెల్లించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ప్రతి క్యాంటీన్‌ వద్ద 300 మందికి ఆహారం అందేలా ఏర్పాట్లు చేశామని చంద్రబాబు చెప్పారు. ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో 203 అన్న క్యాంటీన్ల ద్వారా 2.50 లక్షల మందికి అల్పాహారం, భోజనం అందజేస్తామన్నారు. పేదలు, వృద్ధులకు అన్న క్యాంటీన్లు ఒక వరమని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా క్యాంటీన్ల నిర్వహణ కొనసాగిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

ఉదయం అన్న క్యాంటీన్‌‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు ప్రజలతో కలిసి భోజనం చేశారు. ఆహారం ఎలా ఉందని మహిళలను సీఎం అడిగి తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్‌‌లో భోజనం బాగుందని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే క్యాంటీన్‌‌లోని ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ ద్వారా ఫీడ్‌‌బ్యాక్‌ సీఎం చంద్రబాబు నమోదు చేశారు.