ఏపీలో ‘హోదా బంద్’: స్తంభించిన జనజీవనం

16 April, 2018 - 11:01 AM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిర్వహిస్తున్న బంద్‌ రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణంగా కొనసాగుతోంది. ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర బంద్‌‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌‌కు టీడీపీ, బీజేపీ దూరంగా ఉన్నాయి. బంద్‌‌‌కు టీడీపీ దూరంగా ఉంటుందని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెల్సిందే. వైఎస్ఆర్‌‌సీపీ, వామపక్షాలు, జనసేన, కాంగ్రెస్ పార్టీలు బంద్‌‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. బంద్‌ నేపథ్యంలో రాష్ట్రంలో సోమవారం ఏపీలో జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేశారు. దుకాణాలు ఎక్కడిక్కడ మూసివేశారు.సోమవారం తెల్లవారుజాము నుంచే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కడప, పశ్చిమ, తూర్పుగోదావరి, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, కృష్ణా, అనంతపురం జిల్లాల్లోని అన్ని ఆర్టీసీ డిపోల ముందు ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యమకారులు ఆందోళన చేస్తున్నారు. విజయవాడలోని నెహ్రూ బస్టాండ్‌, గుంటూరులోని ఎన్టీఆర్‌ బస్టాండ్‌ వద్ద నిరసనలు జరుగుతున్నాయి. పలు చోట్ల బస్సులను డిపోల నుంచి బయటికి రాకుండా అడ్డుకోగా.. తిరుపతిలో స్వచ్ఛందంగానే బస్సులను నిలిపివేశారు. అయితే.. తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సులకు మాత్రం మినహాయింపునిచ్చారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రవేటు విద్యాసంస్థలు మూతబడ్డాయి. వాణిజ్య సంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. తిరుపతిలో ఓ ద్విచక్ర వాహనాన్ని ఆందోళనకారులు దగ్ధం చేశారు. బంద్ సందర్భంగా ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. బంద్ శాంతియుతంగా చేయాలని పిలుపునిచ్చారు. ఎలాంటి హింసకు, విధ్వంసానికి పాల్పడకూడదని చెప్పారు. అన్ని పార్టీలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని అన్నారు.బంద్‌ సందర్భంగా వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రకు విరామం ప్రకటించారు. ఉదయం 5 గంటల నుంచే ఆర్టీసీ డిపోల ముందు వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు బైఠాయించి బస్సులను బయటికి రానివ్వకుండా అడ్డుకున్నారు.

కాగా.. మరోవైపున బంద్‌‌ను విచ్ఛిన్నం చేయడానికి కూడా టీడీపీ ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. నిరసనల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవంటూ నోటీసుల ద్వారా విపక్షాల నేతలు, కార్యకర్తలను బెదిరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీకాకుళంలో తమ్మినేని సీతారాం, వామపక్షాల నేతలను అదుపులోకి తీసుకున్నారు.

ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఆందోళన చేస్తే ఏ పార్టీకైనా తాము మద్దతు ఇస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బంద్‌‌ను శాంతియుతంగా నిర్వహించాలని కోరారు. అల్లర్లు, ఉద్రిక్తతలు తలెత్తకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.