ప్రశాంత్ కిషోర్‌తో జగన్ భేటీ!

16 February, 2020 - 6:03 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి థర్డ్ ఫ్రంట్ వైపు అడుగులు వేస్తున్నారా ? అంటే..అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ అంశంపై ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్.. సలహాలు, సూచనలు తీసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇటీవల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని అత్యంత కీలక నేతలతో జగన్ సమావేశమై.. ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఈ థర్డ్ ఫ్రెంట్‌ ప్రధాని అభ్యర్థిగా కేజ్రీవాల్‌ను తెరపైకి తెస్తే ఎలా ఉంటుందనే విషయంపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌తో ఈ విషయంపై చర్చిస్తే.. ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్ పార్టీలోకి కీలక నేతలు జగన్‌తో పేర్కొన్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ బలంగా వీచిందంటే.. అందుకు ప్రశాంత్ కిషోర్ కారణం.. అలాగే 2020 ఫిబ్రవరి 8న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి గెలిచి .. మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారంటే అందుకు ప్రశాంత్ కిషోర్ చలవే అని చెప్పాలి.

ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్‌తో సీఎం జగన్ భేటీ కావాలని నిర్ణయించారు. అందులోభాగంగా ఫిబ్రవరి 16, ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో వీరిద్దరు సమావేశం కానున్నారు. ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ పాక్ డైరెక్టర్లలో ఒకరైన రిషి.. వివాహం ఆదివారం లక్నోలో జరుగుతుంది. ఈ వివాహానికి అటు ప్రశాంత్ కిషోర్, ఇటు జగన్ హాజరుకానున్నారు. అయితే సీఎం జగన్ వెంట.. ఆయన కేబినెట్‌లోని అత్యంత నమ్మకస్తులైన ఇద్దరు మంత్రులను కూడా వెంట బెట్టుకుని లక్నో వెళ్లినట్లు సమాచారం.

అయితే ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్.. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలంటూ గతంలోనే గళం విప్పారు. అందుకోసం ఆయన లక్నో, బెంగళూరు తదితర రాష్ట్రాలకు వెళ్లి.. ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలతో ముచ్చట్లు కూడా జరిపారు. కానీ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి దేశ ప్రజలు స్పష్టమైన మెజార్టీని కట్టబెట్టారు.  దాంతో కేసీఆర్ సైలెంట్ అయిపోయారు. ఇక ఇటీవల హైదరాబాద్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ దాదాపు ఐదు గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీరిరువురి మధ్య థర్డ్ ఫ్రంట్ ముచ్చట జరిగినట్లు సమాచారం.

ఈ సందర్భంగా జరిగిన చర్చలో జగన్.. థర్డ్ ఫ్రంట్‌ను భుజాన ఎత్తుకునేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. ఇప్పటికే కేజ్రీవాల్‌కు దేశవ్యాప్తంగా క్రేజీ ఏర్పడడం.. ఆయన్ని థర్డ్ ఫ్రంట్ ప్రధాని అభ్యర్థిగా బరిలో నిలిపేలా చర్చలు జరిపాలని తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదీకాక ఏపీలో జనసేన పార్టీతో తప్పా.. అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీజేపీ సీనియర్ నేత, ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ సునీల్ దేవధర్.. ఫిబ్రవరి 15వ తేదీ.. విశాఖలో చాలా స్పష్టంగా చెప్పిన విషయం విదితమే. ఇలాంటి సమయంలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారని ఊహాగానాలు ఊపందుకున్నాయి.