కోర్టుకు డుమ్మా కొట్టిన యాంకర్ ప్రదీప్

10 January, 2018 - 1:39 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: డ్రంకెన్ డ్రైవ్ కేసులో యాంకర్ ప్రదీప్ కోర్టుకు డుమ్మా కొట్టారు. ప్రదీప్ బుధవారం నాంపల్లిలోని కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే, షూటింగ్‌లో బిజీగా ఉన్న కారణంగా తాను కోర్టుకు హాజరు కాలేకపోతున్నట్లు ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోమవారం గోషామహల్ పోలీసు స్టేషన్ లో కౌన్సెలింగ్‌కు హాజరైన ప్రదీప్, మంగళవారం నాడు కోర్టుకు హాజరు కావాల్సి వున్నప్పటికీ, కేసుకు సంబంధించిన నివేదికలు కోర్టుకు అందడంలో జరిగిన జాప్యంతో బుధవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులకు ప్రదీప్‌కు సమాచారం అందించారు.

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ప్రదీప్ దాదాపు వారం రోజుల తర్వాత పోలీసుల ముందుకు వచ్చాడు. డిసెంబర్ 31 రాత్రి మద్యం తాగి వాహనాలు నడిపినవారికి వారి తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే ప్రదీప్ కౌన్సెలింగ్‌కు హాజరుకాలేదు. తాను ఎక్కడికీ పారిపోలేదని అంటూ ఓ వీడియోను విడుదల చేశాడు. త్వరలోనే కౌన్సెలింగ్‌కు హాజరవుతానని ఆ వీడియోలో చెప్పిన ప్రదీప్ చివకు సోమవారం పోలీసులు ముందుకు వచ్చాడు. డిసెంబర్ 31న రాత్రి బ్రీత్ ఎనలైజర్ టెస్టులో ప్రదీప్‌కు 178 పాయింట్లు వచ్చాయి. ఆ కేసుతో పాటు కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉండడంపై ప్రదీప్‌పై మరో కేసు కూడా నమోదు అయింది. ఈ నేపథ్యంలో ప్రదీప్‌ బుధవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే, తాను షూటింగ్ లో బిజీగా ఉన్నానని ఆయన చెప్పడంతో కోర్టుకు హాజరయ్యే విషయమై సందిగ్ధత ఏర్పడింది.