అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు షాక్!

07 November, 2018 - 3:15 PM

(న్యూవేవ్స్ డెస్క్)

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మధ్యంతర ఎన్నికల్లో దేశ ప్రజలు షాకిచ్చారు. ట్రంప్ పాలనకు రెఫరెండంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీకి పట్టం కట్టారు. మొత్తం 435 స్థానాలున్న ప్రతినిధుల సభలో 218 సీట్లతో డెమొక్రటిక్ పార్టీ విజయ దుంధుబి మోగించింది. ఇప్పటి వరకూ ప్రతినిధుల సభలో ఆధిక్యం చెలాయించిన రిపబ్లికన్లు కేవలం 193 స్థానాలకే పరిమితమయ్యారు. అయితే ఎగువసభ సెనెట్‌లో మాత్రం రిపబ్లికన్లు తమ ఆధిక్యాన్ని నిలుపుకోగలిగారు. అక్కడ ఎన్నికలు జరిగిన 35 సీట్లలో 26 స్థానాలను రిపబ్లికన్ పార్టీ ఖాతాలో వేసుకుంది. రిప్రజెంటేటివ్స్‌ హౌస్‌, సెనేట్‌ను కలిపి అమెరికా కాంగ్రెస్‌గా వ్యవహరిస్తారు.

తాజా ఫలితాలు అధ్యక్షుడు ట్రంప్‌కు ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వలసదారులపై ట్రంప్ దుందుడుకు చర్యలు, 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి రష్యా సాయం సహా పలు విషయాల్లో అధ్యక్షుడి నిర్ణయాలను డెమొక్రాట్లు అడ్డుకునే అవకాశముందని చెబుతున్నారు. ఇకపై కీలక నిర్ణయాలు తీసుకోవడంలో డెమొక్రాట్ల అంగీకారం లేకుండా ముందుకు వెళ్లడం ట్రంప్‌కు సాధ్యంకాదని వ్యాఖ్యానిస్తున్నారు.

అమెరికా ప్రతినిధుల సభకు ప్రతి రెండేళ్లకోసారి, సెనెట్‌కు ప్రతి ఆరేళ్లకు ఓసారి ఎన్నికలు జరుగుతాయి. తాజాగా ప్రతినిధుల సభలోని 435 స్థానాలతో పాటు సెనెట్ (మొత్తం 100 సీట్లు)లోని 35 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 36 రాష్ట్రాలకు గవర్నర్‌ పదవులకు, ఇతర పలురకాల పదవులకు కూడా ఎన్నికలు జరిగాయి. వర్జీనియా, ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, కొలరాడో లాంటి స్వింగ్‌ స్టేస్ట్‌లో డెమోక్రాట్లు రిపబ్లికన్లపై విజయం సాధించారు. అయితే సెనేట్‌లో ఇండియానా, నార్త్‌ డకోటా స్థానాల్లో డెమోక్రాట్లపై రిపబ్లికన్లు గెలుపొందారు. కీలకమైన టెక్సాస్‌ స్థానంలో రిపబ్లికన్‌ అభ్యర్థి టెడ్‌ క్రుజ్‌ విజయం సాధించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదవీకాలం మధ్యలో జరుగుతున్న ఈ ఎన్నికలను ఆయన పనితీరుపై తీర్పుగా చూడొచ్చని కొందరు అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు.

అయితే.. మధ్యంతర ఎన్నికల్లో గొప్ప విజయం సాధించామని డొనాల్డ్‌ ట్రంప్ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘ఇది గొప్ప విజయం, అందరికీ ధన్యవాదాలు’ అని ట్వీట్‌ చేయడం విశేషం.ఇలా ఉండగా.. అగ్రరాజ్యం అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జారెడ్‌ పోలీస్‌ విజయం సాధించారు. కొలరెడో గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్న జారెడ్‌ అమెరికా చరిత్రలో గవర్నర్‌గా ఎంపికైన తొలి స్వలింగ సంపర్కుడిగా చరిత్రకెక్కారు. తనను తాను గే అని ఎన్నికల ప్రచారంలో బహిరంగంగా ప్రకటించిన జారెడ్‌.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ప్రచారాస్త్రంగా మార్చుకుని విజయం సాధించారు. గతంలోనూ ఐదుసార్లు కాంగ్రెస్‌ ప్రతినిధిగా ఎన్నికైన జారెడ్‌ ఇకపై కొలరాడో గవర్నర్‌గా సేవలు అందించనున్నారు. యూదు అయిన జారెడ్‌ అసలు పేరు జారెడ్‌ చుల్జ్‌. తన బామ్మ ఙ్ఞాపకార్థం 25 ఏట తన పేరును జారెడ్‌ పోలీసుగా మార్చుకున్నారు. కాలేజీ రోజుల నాటి నుంచే రాజకీయాల్లో రాణించాలనే ఆశయం ఉన్న జారెడ్‌ మొదట వ్యాపారవేత్తగా ఎదిగి… ఆ తర్వాత డెమొక్రటిక్‌ పార్టీలో చేరి తన కలను సాకారం చేసుకున్నారు.

కాగా ఓరెగాన్‌ గవర్నర్‌ కేట్‌బ్రౌన్‌ అమెరికా తొలి బైసెక్సువల్‌ గవర్నర్‌గా గుర్తింపు పొందగా.. న్యూజెర్సీ మాజీ గవర్నర్‌ జిమ్‌ మెక్‌గ్రీవీ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత తాను గేనని ప్రకటించుకున్నారు.