ఉద్యోగానికి ఆలోక్ వర్మ రాజీనామా!

11 January, 2019 - 5:00 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యఢిల్లీ: సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత పోలీస్‌ సర్వీసు నుంచి తప్పుకుంటున్నట్టు ఆలోక్‌ వర్మ శుక్రవారం ప్రకటించారు. ఫైర్‌ సర్వీసుల డైరెక్టర్‌ జనరల్‌ బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించిన వర్మ ఉద్యోగానికి రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో బుధవారం మళ్ళీ సీబీఐ డైరెక్టర్‌‌గా బాధ్యతలు తీసుకున్న ఆలోక్‌ వర్మను ఆ బాధ్యతల నుంచి కేంద్రం గురువారం సాయంత్రం తప్పించింది. ఆయనను ఫైర్‌ సర్వీసెస్‌, హోమ్‌గార్డ్స్ విభాగాల డీజీగా బదిలీ చేసింది. ఈ పరిణామాలతో ఆలోక్ వర్మ తీవ్ర మనస్తాపానికి గురై కొత్త బాధ్యతలు చేపట్టకుండానే ఉద్యోగానికి రాజీనామా చేయడం గమనార్హం.

సీబీఐ చీఫ్‌‌గా తనను తప్పించి ప్రభుత్వం అకారణంగా సెలవుపై పంపడాన్ని సవాల్‌ చేస్తూ ఆలోక్‌‌వర్మ దాఖలు చేసిన పిటిషన్‌‌పై విచారించిన సుప్రీంకోర్టు ఆలోక్‌‌కు సీబీఐ పగ్గాలు అప్పగించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

సీబీఐలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా మారాయి. ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్ ఆస్థానాకు, ఆలోక్‌‌కు మధ్య విభేదాలు తారస్థాయికి చేరడం, అధికారులు కూడా రెండు వర్గాలుగా విడిపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో ఇరువురు అధికారుల మధ్య నెలకొన్న పరిస్థితి సీబీఐ పరువు తీసేవిధంగా ఉందంటూ అక్టోబర్‌ 23న అర్ధరాత్రి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు అధికారులనూ బలవంతంగా సెలవుపై పంపిస్తూ ఆదేశాలు జారీచేయడంతో పాటు సీబీఐలోనే అసిస్టెంట్‌ డైరెక్టర్‌‌గా పనిచేస్తున్న ఎం. నాగేశ్వరారవుకు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌‌గా బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది.

ఎవరో చేసిన ఆరోపణలకు తనను బలిచేశారనే ఉద్దేశంతో ఆలోక్ అగ్నిమాపక డీజీగా బాధ్యతలు స్వీకరించేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే కొత్త బాధ్యతలు స్వీకరించకుండా పదవీ విరమణ చేస్తున్నట్టు కేంద్రానికి సమాచారం పంపారు.